అనంతపురం అగ్రికల్చర్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, కరువు రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందేలా చూడాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నతస్థాయి అధికారుల బృందం సోమవారం జిల్లాలో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ గోట్మారా కేంద్ర బృందానికి టీం లీడర్‌గా వ్యవహరించగా... ఆయనతో పాటు ఆరుగురు అధికారులు బృందంలో ఉన్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, పశుగ్రాసం సమస్య, తాగునీటి, పండ్లతోటల స్థితిగతులపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను వారు తిలకించారు. అనంతరం ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోండి
ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లాలోని 30 కరువు మండలాల్లో 1,96,681 మంది రైతులకు సంబంధించి 2,29,136 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.999.77 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ నిబంధనల మేరకు జిల్లా రైతులకు రూ.280.41 కోట్ల సాయం అందించాలని కేంద్ర కరువు బృందాన్ని కోరారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని 29 కరువు మండలాల పరిధిలో 1,44,818 మంది రైతులకు చెందిన 1,28,972 హెక్టార్లలో పంటలు దెబ్బతినడంతో రూ.682.34 కోట్ల నష్టం జరిగిందన్నారు. నిబంధనల మేరకు రూ.173.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి పశుశాఖకు రూ.24.93 కోట్లు, రూరల్ వాటర్ సప్లయ్‌కి రూ.15.57 కోట్లు, అర్బన్ వాటర్ సప్లయ్‌కి రూ.1.75 కోట్లు, డ్వామా పరిధిలో రూ.61.39 కోట్ల మేర కేంద్రం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మండలాల్లో కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
నేడు బత్తలపల్లి మండలంలో పర్యటన
బత్తలపల్లి: కరువు అంచనా వేసేందుకు కేంద్రం బృందం మంగళవారం బత్తలపల్లి మండలంలోని బత్తలపల్లి, గుమ్మల్లకుంట, దంపెట్ల, రామాంజులపల్లి గ్రామాల్లో పర్యటించనున్నట్లు మండల ఏఓ ఓబిరెడ్డి తెలిపారు.
‘అనంత’కు రూ.280.41 కోట్లు, శ్రీసత్యసాయికి రూ.173.11 కోట్లు ఇవ్వండి
అనంతపురం జిల్లా పర్యటనలో కేంద్ర కరువు బృందానికి కలెక్టర్ ఆనంద్ వినతి


