ఓడీచెరువు: ప్రజలకు మంచి చేసి ఉంటే కూటమి ప్రభుత్వానికి భయమెందుకని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని కొండకమర్ల, గాజుకుంటపల్లి, నల్లగుట్లపల్లి, వేమారెడ్డిపల్లి, ఎంబీక్రాస్, చౌడంపల్లిలో సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎదుర్కోవాలి గానీ టీడీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరింపులు ఎందుకని ‘పల్లె’ను ఉద్దేశించి ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ఆపడానికి పల్లె అబ్బ సొమ్మేమీ ఇవ్వడం లేదని, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపినా కోర్టుకీడ్చి పథకాలు తిరిగి అమలు చేయించే బాధ్యత తనదని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన పనులకు మళ్లీ శిలాఫలకాలు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు ఎన్నికల వేళ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు చేస్తారన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, తమ జోలికి వస్తే మాత్రం సహించవద్దని, అన్నిటికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మండలంలోని 14 ఎంపీటీసీలు, జెడ్పీటీసీగా రాజు నాయుడును గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దామని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీరెడ్డి, జడ్పీటిసి అభ్యర్థి రాజునాయుడు, ఎంపిటిసి అభ్యర్థులు కుర్లి దామోదర్ రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆనంద నాయక్, క్రిష్ణ వర్దన్, శ్యామల, అశ్వర్థమ్మ, హరిత, సహారాభాను, దివాకర్ రెడ్డి, భాగ్యలక్ష్మీ, శైలజ, దొడ్డెమ్మ, గంగులమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.


