హిందూపురం టౌన్: రైల్వేస్టేషన్‌లో విక్రయదారుల దౌర్జన్యాలు హెచ్చుమీరుతున్నాయి. ప్రయాణికులపై ఏకంగా దాడి చేయబోయిన ఘటన హిందూపురం రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆగింది. రైలులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు స్టేషన్ ప్ల్లాట్‌ఫారంపై విక్రయిస్తున్న అరటిపండ్లు కొనుగోలు చేయబోయారు. రెండు పండ్లు ఇవ్వాలని వ్యాపారిని అడిగారు. రెండు పండ్లు నేను ఇవ్వను.. ఒకటి, రెండు పండ్లు అమ్ముకునే వాడిలా కనిపిస్తున్నానా..? అంటూ ప్రయాణికులపై దుర్భాషలాడాడు. ప్రయాణికులు అతనితో వాదించగా.. విక్రయదారుడు మళ్లీ దుర్భాషలాడాడు. పత్రికలో రాయలేని మాటలతో వారిపై విరుచుకుపడ్డాడు. అరటి పండ్లు కోసే చిన్న కత్తితో వారిపై దాడి చేయడానికి యత్నించాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కట్టెతో దాడి చేయబోయాడు. కిందకు రండి మీ అంతు చూస్తానంటూ బెదిరింపు ధోరణితో ఊగిపోయాడు. స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇవ్వడంతో రైలు ముందుకు వెళ్లిపోయింది. ట్రైన్ వెళ్లకపోయి ఉంటే అతను రైలు ప్రయాణికులపై దాడి చేసేవాడని స్థానికులు చర్చించుకున్నారు. దీనిపై రైల్వే పోలీసులు స్పందించి దురుసుగా వ్యవహరించిన అరటిపండ్ల వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అరటిపండ్లు కోసే కత్తితో దాడి చేయబోయిన విక్రయదారుడు
హిందూపురం రైల్వేస్టేషన్ ప్ల్లాట్‌ఫారంపై ఘటన


