కదిరి టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది. అధికారం అండతో పోలీసులను ఉసిగొల్పి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి (యాక్టివిటీ), కదిరి జెడ్పీటీసీ స్థానం నుంచి బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ జెడ్పీ ‘చైర్మన్’ అభ్యర్థి వజ్ర భాస్కర్‌రెడ్డి ఇంటిపైకి పోలీసులను ఉసిగొల్పింది. ఈక్రమంలోనే కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రాత్రి రిలయన్స్ డిజిటల్ అపార్ట్మెంట్లో ఉన్న వజ్రభాస్కర్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా దాదాపు మూడు గంటల సేపు సోదాలు చేశారు. ఈ సోదాల్లో వజ్రభాస్కర్‌రెడ్డి ఇంట్లో రూ.9 లక్షలు లభించగా కదిరి తహసీల్దార్ రెడ్డిశేఖర్, ఎంపీడీఓ పోలప్ప ఆధ్వర్యంలో పంచనామా చేశారు. ఆ డబ్బు తన కుమార్తె కళాశాల ఫీజు కోసం దాచి ఉంచానని వజ్ర భాస్కర్‌రెడ్డి అధికారులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం చూపించారు. దీంతో వారు ఆ మొత్తాన్ని తిరిగి ఆయనకు అప్పజెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న వజ్ర భాస్కర్‌రెడ్డిని భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా జెడ్పీ పీఠం కై వసం చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా వజ్ర భాస్కర్‌రెడ్డి తేల్చిచెప్పారు.
వజ్ర భాస్కర్‌రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి


