● తుపాను సహాయక చర్యల కోసం
కమాండ్ కంట్రోల్ రూం : కలెక్టర్
ప్రశాంతి నిలయం: మురసు తుపాను ప్రభావం జిల్లాపై ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుపాను సమయంలో తక్షణ సహాయ చర్యల కోసం కలెక్టరేట్‌లో 08555–289039 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తుపాను సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తినా కంట్రోల్‌రూంను సంప్రదించి సాయం పొందవచ్చన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు వెళ్లకూడదని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరగడం, రహదారులపై నీరు నిలిచిపోవడం తదితర సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రకృతి సేద్యంతో
ఆరోగ్యకరమైన ఆహారం
గుడిబండ: రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంతో పండించే ఉత్పత్తులతో ఆరోగ్యకర ఆహారం లభిస్తుందని, తద్వారా మానవాళికి పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ చెఫ్ డారీనా అలెన్ పేర్కొన్నారు. సోమవారం ఆమె గుడిబండ మండలంలోని జవనడుకు గ్రామంలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన పంటలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం కోసం వాడే కషాయాలు, జీవామృతం తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సహజ సిద్ధమైన ఎరువులు, కషాయాలతో పంటలు పండించడం అభినందనీయమన్నారు. ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా ప్రకృతి ఆహారానికి ఆదరణ ఉందని, ఇక్కడి రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతులు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. అనంతరం పలువురు రైతుల క్షేత్రాలను సందర్శించారు.
మృతుల పేర్లతో
ఓటరు స్లిప్‌ల పంపిణీ
బత్తలపల్లి: పరిషత్ ఎన్నికల్లో భాగంగా 5వ తేదీ పోలింగ్ జరగనుండగా..ఓటరు స్లిప్‌ల పంపిణీ జరుగుతోంది. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో బీఎల్‌ఓలు ఓటరు స్లిప్‌లను అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే చనిపోయిన వారి పేరుతో ఉన్న ఓటరు స్లిప్పులను కూడా అందజేస్తుండడం గమనార్హం. చనిపోయిన వారి ఓటరు స్లిప్పులు ఇవ్వడమేంటని స్థానికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నట్లు బీఎల్‌ఓలు సమాధానమిస్తున్నారు.


