పావగడ: తాలూకాలోని అరసికెరె పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేటీ హళ్లి గ్రామంలో ప్రభుత్వా ఆస్పత్రికి ఎదురుగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు యువకులు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు... మొళకాల్మూరు తాలూకా మల్లూర హళ్లి వాసి సుదీప్ గొర్రెల కాపరి. జీవాలను ఎక్కడ మేపినా రాత్రికి కేటీ హళ్లికి వచ్చి ఉదయమే వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే బల్లిబట్లు గ్రామం నుంచి సుదీప్‌తో పాటు మరో యువకుడు ద్విచక్ర వాహనంపై కేటీ హళ్లి వస్తున్నారు. మరోవైపు పావగడ తాలూకా కరియమ్మనపాళ్యకు చెందిన రైతు నాగరాజు పని నిమిత్తం మరో యువకుడితో కలిసి కేటీ హళ్లికి వస్తున్నారు. అయితే కేటీ హళ్లి ప్రభుత్వాస్పత్రి వద్ద రెండు బైకులు ఢీ కొన్నాయి. క్షతగాత్రులను వెంటనే తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుదీప్ (24), నాగరాజు (35) చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అరసికెరె పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతి వేగమే ప్రమాదాలకు కారణమని, రోడ్డు భద్రత నిబంధనాలు పాటించాలని ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు.
రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి మృతి
● ప్రేమ వ్యవహారమే కారణమా?
రాప్తాడు రూరల్: ప్రేమ వ్యవహారం ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణం తీసిందా? ప్రేమించిన యువతితో పెళ్లి విషయంలో పెద్దల నుంచి అభ్యంతరాలు ఎదురుకావడంతో మనస్తాపానికి గురయ్యాడా? అనంతపురం నగరానికి చెందిన షేక్ అయాజ్ (21) రైలు కింద పడి మృతి చెందిన ఘటనలో ఈ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రాప్తాడు మండల పరిధిలోని పండమేరువంక రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అయాజ్ రైలు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలిసింది. షేక్ అయాజ్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మరోవైపు ఓ బిల్డర్ వద్ద పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తండ్రి షేక్ జాఫర్ ఆర్టీఏ కార్యాలయంలోని ఓ ప్రైవేట్ ఏజెంట్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కుమార్తెను కోల్పోయిన ఆ కుటుంబానికి, ఇప్పుడు ఒక్కగానొక్క కుమారుడు కూడా దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వీడియో చుట్టూ అనుమానాలు..
అయాజ్ ఓ యువతిని గాఢంగా ప్రేమించాడని, పెళ్లి విషయంలో పెద్దల నుంచి అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మరోవైపు, ఘటనకు ముందు అయాజ్ ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడని, ఆ తర్వాత అది తొలగించబడినట్లు ప్రచారం జరుగుతోంది.


