మడకశిరరూరల్: మండల పరిధిలోని భీమరాయనపల్లికి చెందిన మల్బరీ రైతు నారాయణస్వామి షెడ్‌లో మల్బరీ ఆకు, పురుగులపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. బాధిత రైతు వివరాల మేరకు.. నారాయణస్వామి.. పట్టు గుడ్లు పెంపకం చేపట్టారు. రెండు రోజుల్లో పట్టు పురుగులను చంద్రికల్లోకి వదలాల్సి ఉంది. గురువారం రాత్రి షెడ్‌లో ఉన్న మల్బరీ ఆకు, పురుగులపై విష ప్రయోగం చేశారు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా మల్బరీ సూట్‌లోనే పురుగులు చనిపోయి దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమశాఖ ఏడీ హనుమంతరాయ సిబ్బందితో వెళ్లి చనిపోతున్న పట్టు పరుగులను పరిశీలించారు.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడనే..
మల్బరీ సూట్‌లో చనిపోయిన పట్టు పురుగులను రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు వైసీ గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి నాగభూషణరెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ఎస్‌ఈసీ సభ్యుడు మాట్లాడుతూ నారాయణస్వామి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు కావడం, పైగా ఎంపీటీసీ అభ్యర్థి ఆర్ వెంకటేశులు గెలుపుకు ప్రచారం చేస్తుండడంతో జీర్ణించుకోలేక రాజకీయ కక్షతోనే ఇలా చేశారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగడం చాలా దురదృష్టకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
రెండు లక్షలకు పైగా నష్టం


