రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలి

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

● కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

ప్రశాంతి నిలయం: జిల్లాలోని పాఠశాలల సమీప ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ అధ్యక్షతను జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్లు, ప్రధానదారులకు,జాతీయ రహదారులు కలిసే ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్‌ మార్కింగ్స్‌ తదితర భద్రతా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రతి 40 కిలో మీటర్లకు పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు జాయతీ రహదారుల పర్యవేక్షణ అధికారి శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను పక్కాగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ మిషన్‌ ఇంద్ర ధనుస్సు, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జిల్లాలో హెచ్‌ఐవీ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, ఐసీడీఎస్‌ పీడీ ప్రమీళ, సీడీపీఓలు, జిల్లా ఎయిడ్స్‌ కంట్రోల్‌ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ

పక్కాగా సాగాలి : జేసీ

పుట్టపర్తి: పరిషత్‌ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ నెల 30వ తేదీనే పోస్టల్‌ బ్యాలెట్‌ అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ తెలిపారు. గురువారం ఆయన బుక్కపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం, స్ట్రాంగ్‌ రూంలు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. సర్వీసు ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ, స్వీకరణ పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రికార్డులు పక్కాగా నమోదు చేయాలన్నారు. జేసీ వెంట జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ సీఈఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్ష ఫీజు

గడువు పొడిగింపు

పుట్టపర్తి టౌన్‌: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును నవంబర్‌ 10వ తేదీ వరకూ పొడిగించినట్లు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి చెన్నకేశవ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 29వ తేదీతో గడువు ముగిసిందన్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 10తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.1,000 అపరాధ రుసుముతో నవంబర్‌ 17వ తేదీ వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు.

సదరం స్లాట్ల విడుదలకు ఈసీ అనుమతి

అనంతపురం ఎడ్యుకేషన్‌: దివ్యాంగులకు ఊరట లభించింది. సదరం ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సాధారణ వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసినట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. ఇప్పటివరకు సదరం ధ్రువీకరణ పత్రాలు పొందని అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement