పెనుకొండ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిచేసే వారికే పట్టం కట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆమె పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురం, మంగాపురం, కోనాపురం గ్రామాల్లో చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులుతో కలిసి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ప్రతి గడపకూ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ టీడీపీ నాయకులు అలవిగాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత వాటన్నింటినీ తుంగలోతొక్కి ప్రజలను మోసం చేశారన్నారు. నిజంగా రెండున్నరేళ్లలో వారు అభివృద్ధి చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారన్నారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా బైండోవర్ కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. అక్రమ కేసులతో భయపెట్టలేరన్న విషయం గుర్తించాలన్నారు.
ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్ పిలుపు


