న్యూస్‌రీల్
చెన్నేకొత్తపల్లి (కనగానపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చెన్నేకొత్తపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రం పరిసరాలతో పాటు గదుల భద్రత గురించి పోలీసులతో ఆరా తీశారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవ్వరూ చొరబడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల గురించి పోలీసులతో మాట్లాడారు. అలాగే మండలంలోని ముష్టికోవెల గ్రామంలో ఏఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో రామగిరి సీఐ మహమ్మద్ అలీ, పోలీసులు పాల్గొన్నారు.
కనగానపల్లిలో..
మండలంలోని మామిళ్లపల్లి, చంద్రాచెర్ల గ్రామాల్లో ఏఎస్పీ మహేష్ బుధవారం పర్యటించారు. ఓటు వేయడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు
తాడిపత్రి రూరల్: అర్నబ్ తుపాన్ కారణంగా విశాఖ నుంచి తాడిపత్రి మీదుగా గుంతకల్లుకు వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521)ను బుధవారం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్లు నుంచి విశాఖ వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్ యథావిధిగా బయలుదేరి వెళ్లింది. ధర్మవరం– మచిలీపట్నం వెళ్లే ఎక్స్‌ప్రెస్ (17216) నిర్ణీత వేళకే బయల్దేరింది.


