● ఎస్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం
● మేం చెప్పినవారినే చైర్మన్లుగా పెట్టాలంటూ ‘పచ్చ’ నేతల హుకుం
● హెచ్‌ఎంలు, ఎంఈఓలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
● నిధులపై కన్నేసి.. కమిటీలను గుప్పిట్లో పెట్టుకునే యత్నం!
● నేడు జిల్లాలోని 2,034 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు రాజకీయ జోక్యంతో వివాదాస్పదంగా మారుతున్నాయి. విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన కమిటీల్లోనూ అధికార పార్టీ నేతలు తమ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘మేం చెప్పిన పేర్లనే ఖరారు చేయాలి.. మేం సూచించిన వారినే చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించాలి’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు నేరుగా హెచ్‌ఎంలు, ఎంఈఓలకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన తాము రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాలా.. లేక నిష్పాక్షికంగా వ్యవహరించాలా.. అన్న సందిగ్ధంలో పడుతున్నారు.
ఓటర్ల జాబితాలపైనా నేతల కన్ను
ఎన్నికల నిర్వహణలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఓటరు జాబితాలను సిద్ధం చేసి నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అయితే ఆ జాబితాలను తమకు పంపాలని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ‘తల్లిదండ్రుల ఓటరు జాబితాలు సిద్ధమైన వెంటనే మాకు పంపండి.. ఎమ్మెల్యే అడిగారు.. ఆయనకు అందజేయాలి’ అంటూ ఓ ఎంఈఓ స్వయంగా హెచ్‌ఎంల కాన్ఫరెన్స్‌లో చెప్పినట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఖరారు చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన అధికారులపై ఇలాంటి ఒత్తిళ్లు రావడం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలు ఒకవైపు..
నేతల ఆదేశాలు మరోవైపు
ఎస్‌ఎంసీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా, సమ్మిళితంగా నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కమిటీలో 75 శాతం మంది తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచే ఉండాలి. మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులకూ తగిన ప్రాతినిధ్యం ఉండాలి. అర్హులైన తల్లిదండ్రుల మధ్య ఎన్నికలు నిర్వహించి, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఓటింగ్ చేపట్టాలి. తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట నేతల సూచనలే తుది నిర్ణయాలుగా మారే పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 2,034 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతోపాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలల్లో నిర్వహణ, అభివృద్ధి పనులపై పర్యవేక్షణతోపాటు నిధుల వినియోగంలోనూ ఎస్‌ఎంసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ‘నాడు–నేడు’ రెండో విడత పనులు చేపడుతున్న పాఠశాలల్లో నిధుల వినియోగానికి సంబంధించి కమిటీల నిర్ణయాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలమైన వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమించుకోవడం ద్వారా భవిష్యత్తులో పాఠశాలల అభివృద్ధి పనులు, నిధుల ఖర్చుపై పరోక్షంగా పట్టు సాధించవచ్చనే ఉద్దేశంతోనే కొందరు నేతలు పావులు కదుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


