పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఆర్‌ఎస్‌కే సిబ్బంది, పశు సంవర్ధక శాఖ సిబ్బందిపై ఎల్‌నినో ప్రత్యేకాధికారి డాక్టర్ మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధితశాఖ సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, పశువులకు సంబంధించిన మందులు నిల్వ ఉంచకపోవడం, రైతు సేవా కేంద్రాన్ని మూసి వేసి ఉండడంతో ఆదివారం ‘సాక్షి’లో ‘ఎప్పుడూ మూతే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎల్‌నినో ప్రత్యేకాధికాధికారి మాధవీలత ఏతో శ్రీవాణితో కలిసి సదరు రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. మందుల నిల్వపై ఎవరు అనుమతిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా లేని కారణంగా ఇద్దరు సిబ్బందిపై మరో సారి ఇలా జరిగితే బాగుండదు అంటూ మందలించారు.
రైతాంగాన్ని ఆదుకోకపోవడం విచారకరం
బత్తలపల్లి: కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడం విచారకరమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతా బత్తలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ, కంది, ఆముదం, చీనీ, దానిమ్మ తదితర పంటలను సాగు చేసిన రైతులు వర్షాభావంతో పంటలు ఎండి తీవ్రంగా నష్టపోయారన్నారు. సత్యసాయి జిల్లాలో 12.60 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా 2.74 లక్షల ఎకరాలలో మాత్రమే సాగయినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం రూరల్ మండలాల్లోని చెరువులన్నింటినీ హెచ్‌ఎల్‌సీ, పీఏబీఆర్ నీటితో నింపి భూగర్భజలాలు పెరిగేలా చూడాలన్నారు. ఈ నెల 30న సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు, సీపీఎం నాయకులు ఎస్‌హెచ్ బాషా, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మారుతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జేవీ రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున, సీఐటీయూ నాయకులు జగన్, రామమోహన్, ఎల్.ఆదినారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు పోతలయ్య తదితరులు పాల్గొన్నారు.


