రొద్దం: మండలంలోని కోగిర జెడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని మైత్రి రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం హరికిరణ్, పీడీ మహేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24న అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహిచిన పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి 11 వరుకు ఆర్డీటీ క్రీడామైదానంలో ఆడనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 13 నుంచి 16 వరకు శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడి మృతి
మడకశిర: పట్టణంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని యాచకుడు ముత్తు(42) మృతిచెందాడు. వివరాలు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన యాచకుడు ముత్తు కొన్నేళ్లుగా మడకశిరలో ఉంటూ భిక్షాటన చేసుకొని జీవించేవాడు. ఇతనికి మతిస్థిమితం కూడా సరిగా ఉండేది కాదు. ఆదివారం రాత్రి పావగడ రోడ్డులోని శివాలయం వైపు నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో ముత్తు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృత దేహాన్ని గుర్తించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతుడిది తమిళనాడు రాష్ట్రమైనా సరైన అడ్రస్ తెలియకపోవడంతో పోలీసులు, మున్సిపల్ కార్మికులు అంత్యక్రియలు పూర్తి చేశారు. యాచకుడు ముత్తు పట్టణ ప్రజలకు సుపరితుడు కావడంతో కొందరు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు పరిష్కారం
పుట్టపర్తి టౌన్: క్షేత్రస్థాయిలో పర్యటించి, విచారణ చేసి అర్జీదారులకు సత్వరమే న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై మొత్తం 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి, వారితో మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి, పరిష్కారం చూపుతామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడి మృతి
పెనుకొండ రూరల్: పెనుకొండ 44వ జాతీయ రహదారిపై అమ్మవారిపల్లి కియా పోలీస్‌స్టేషన్‌ఎదుట స్పీడు బ్రేకర్ల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బొగ్గు నరసింహ(65) సోమవారం మృతిచెందాడు. వివరాలు.. చెన్నెకొత్తపల్లికి చెందిన బొగ్గు నరసింహ కంటి పరీక్షల నిమిత్తం పెనుకొండలోని కాళీశ్వర స్వామి ఆశ్రమానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గంమధ్యలో అమ్మవారిపల్లి వద్ద కియా పోలీస్ స్టేషన్ ముందర స్పీడు బ్రేకర్లు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో బొగ్గు నరసింహ తలకు బలమైన గాయాలయ్యాయి. పోలీసులు 108 వాహనం ద్వారా పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నరసింహ కుమారుడు నరేష్ కూడా మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మృతుడికి కూతుర్లు వరలక్ష్మి, గంగరత్న, గౌరి ఉన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు.
పెట్రోల్ కోసం వెళ్తూ.. పరలోకాలకు
రాప్తాడు రూరల్: పెట్రోలు కోసం వెళ్లిన ఓ వృద్ధ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హంపాపురానికి చెందిన ఆండ్ర సుబ్బరాయుడు (61) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై పెట్రోల్ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో సుబ్బరాయుడు బైక్‌తో సహా రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం. ఇద్దరు కూతుళ్లకు వివాహాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


