● ఉచితం మాటున ఊడ్చేస్తున్నారు
● నదులు కొల్లగొడుతున్న ‘పచ్చ’ నేతలు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
అనంతపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు ఇసుక ఆదాయ వనరుగా మారింది. నదీ పరివాహక ప్రాంతాలలో అనుమతులు లేకుండానే జేసీబీలు, హిటాచీలను పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగిపోతోంది. శింగనమల నియోజకవర్గంలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. గార్లదిన్నె మండలంలోని పెన్నానది, శింగనమల కూతలేరు నదితోపాటు పెన్నా పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున ఉంది. యల్లనూరు మండలంలో చిత్రావతి నది ఉండడంతో ఇసుక లభ్యత అధికంగా ఉంది. దీంతో టీడీపీ నాయకుల కన్ను వీటిపై పడింది. రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తున్నారు.
రీచ్‌లు లేకున్నా.. ఇసుక రవాణా
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు లేవు. అయినా ఇసుకకు కొరత లేదు. ఎవరికై నా ఇసుక కావాలంటే టీడీపీ నాయకులు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు. బహ్మసముద్రం మండలంలోని వేదావతి, కంబదూరు మండలంలోని పెన్నానది నుంచి ఇసుకను తవ్వేసి కళ్యాణదుర్గం మండల కేంద్రంతోపాటు కర్ణాటక ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు స్థానిక ప్రజాప్రతినిధి ఆర్‌ఎంసీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్లాంటుకు పెద్ద ఎత్తున ఇసుకను తరలించేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిద్ర మత్తు వీడడం లేదు.
ఇసుకాసురులు ముదిగుబ్బ సమీపంలోని చిత్రావతి నదిని చిత్రవధ చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా పీసీరేవు సమీపంలోని చిత్రావతి నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా రవాణా చేస్తూ రూ.కోట్లు కూడబెడుతున్నారు. వీరి ధన దాహానికి చిత్రావతి నది రూపురేఖలు మారిపోగా, పీసీరేపు గ్రామ రహదారి దెబ్బతినింది. అధికారులుకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఈనెల 5వ తేదీన గ్రామస్తులే రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పైపులు వేసి ఇసుక వాహనాలను అడ్డుకున్నారు.


