నేడు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

నల్లచెరువు: రాష్ట్ర షెడ్యూల్‌ తెగల (ఎస్టీ) కమిషన్‌ చైర్మన్‌ సొల్ల బోజిరెడ్డి మంగళవారం మండలంలో పర్యటించనున్నట్లు తహసీల్దార్‌ రవి నాయక్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ మండలంలోని బాలేపల్లి తండా గ్రామాన్ని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోని గిరిజనులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, వారి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలులో పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నట్లు వెల్లడించారు.

చిన్నారుల వేలిముద్రలు నవీకరించండి

కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌

ప్రశాంతి నిలయం: పిల్లల ఆధార్‌ను అప్‌డేట్‌ చేయడంతో పాటు వేలిముద్రలను నవీకరించాలని, ఈ ప్రక్రియను మూడు నెలల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 0 – 5 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు సంబంధించిన 25,291 ఆధార్‌ అప్‌డేషన్లు పెండింగ్‌ ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ, అంగన్‌ వాడీ కేంద్రాల సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆధార్‌ అప్‌డేషన్ల కోసం పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డీఈఓ, ఆర్‌ఐఓలను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రతి నెలా రెండు ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించాలన్నారు. ఆధార్‌ సేవా కేంద్రాల్లో యూఐడీఏ నిబంధనల కంటే అధికంగా రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆధార్‌కు సంబంధించిన సమాచారం కోసం జిల్లా ఆధార్‌ నోడల్‌ అధికారి కృపానంద రెడ్డిని 9154409500 నంబరులో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ‘స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు’ సచివాలయాల జిల్లా అధికారి శ్రీలక్ష్మి, ఆర్‌ఐఓ కేశవ ప్రసాద్‌, యూఐడీఏఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ దామోదర్‌, హెల్త్‌ ఆఫీసర్లు, సీఎస్సీ జిల్లా మేనేజర్‌ పాండు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలి

జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వివిధ సమస్యలపై 323 అర్జీలు అందించగా...వాటిని ఆయా శాఖలకు పంపారు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమం అనంతరం జేసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్జీలన్నీ నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే లక్ష్యంతో పని చేయాలని ఆధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, ఎస్‌డీసీ విజయకుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రిషికేశ్‌లో తనకల్లు వాసి మృతి

తనకల్లు: గంగాస్నానం చేసేందుకు భార్యతో కలిసి రిషికేశ్‌ వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...తనకల్లుకు చెందిన సురేంద్రబాబు (62) స్థానిక మూడురోడ్ల కూడలిలో కొన్నేళ్లుగా కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం భార్య సుధావాణితో కలిసి గంగా స్నానం చేయడానికి రిషికేశ్‌కు వెళ్లాడు. సోమవారం రిషికేశ్‌లో ఉన్న సురేంద్రబాబుకు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement