మడకశిర: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తాగునీటి సమస్యతో పాటు పశుగ్రాసం కొరత తీవ్ర రూపం దాల్చిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. గ్రాసం కొరతతో రైతులు తమ పశువులను కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పశుగ్రాసం, దాణా సరఫరా చేసి మూగ జీవాలు కబేళాలకు తరలిపోకుండా చూడాలని కోరారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం మూగజీవాలను ఆదుకోవాలని కోరుతూ ఆర్డీఓ నాగప్రసన్నలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈరలక్కప్ప మాట్లాడుతూ... ఈ ఏడాది మడకశిర నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గ్రాసం కొరత తీవ్రరూపం దాల్చడంతో మూగజీవాల పరిస్థితి కడు దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూగ జీవాలకు తాగునీటి కొరత కూడా అధికంగా ఉందన్నారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు కరువు మండలాలను కూడా ప్రకటించలేదన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. వెంటనే మొద్దు నిద్ర వీడి కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే పశుసంపద కనుమరుగైపోవడం ఖాయమన్నారు. రైతులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఈవిషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు సికిందర్, పట్టణ ఉపాధ్యక్షుడు గోపి, పట్టణ బూత్ కమిటీ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, పట్టణ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు రఘునందన్, పంచాయతీరాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బాబు, స్థానిక నాయకులు శీన, సురంగల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప వినతి
గ్రాసం కొరతతో మూగజీవాలు
కబేళాలకు తరలుతున్నాయని ఆవేదన


