నమ్మించి నట్టేట ముంచారయ్యా | - | Sakshi
Sakshi News home page

నమ్మించి నట్టేట ముంచారయ్యా

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

ధర్మవరం: ‘‘ఎన్నికలకు ముందు కూటమి నాయకుల మాయమాటలను నమ్మి ఓట్లు వేశాం...తీరా అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచారు. గత ప్రభుత్వం అందించిన నేతన్న నేస్తం పథకానికి రెండేళ్లు మంగళం పాడారు. తీరా ఈ ఏడాది నేతన్న సేవలో అంటూ పథకాన్ని ప్రారంభించినా కూటమి పార్టీల నేతలే పంచుకుతిని అర్హులకు మొండి చేయి చూపారు’’ అంటూ పలువురు చేనేత కార్మికులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ‘గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం పట్టణంలోని 8వ వార్డులో పర్యటించారు. చేనేతల ఇళ్ల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు మాట్లాడుతూ... గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24 వేలు ఠంఛన్‌గా సాయం అందేదన్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి రెండేళ్లపాటు పథకం నిలిపివేశారన్నారు. మరోవైపు ముడిపట్టు ధరలు పెరిగి అప్పుల బాధలతో అల్లాడిపోయామన్నారు. తీరా ఈ ఏడాది నెల కిందట ‘నేతన్నసేవలో’ అంటూ పథకం అమలు చేసినా...అర్హులకు అందలేదన్నారు. ఆటోవాళ్లు, బేల్దార్లు, కూలీలకు పథకం వర్తింపజేసి వారి నుంచి సగం మొత్తం తీసుకున్నారన్నారు. చేనేత మగ్గాలున్న తమ దరఖాస్తులను చెత్తబుట్టలో పడేశారన్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు.

మూడేళ్ల సాయం అందించే వరకూ

పోరాడతాం

‘నేతన్న సేవ’లో పథకాన్ని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆదాయ వనరుగా మార్చుకుని సగం సగం పంచుకుని తినడంపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రెండేళ్ల పాటు పథకం నిలిపివేసిన బకాయిలతోపాటు ఈ ఏడాదితో కలిపి ఏడాదికి రూ.25 వేల చొప్పున మొత్తం ఒక్కో కుటుంబానికి రూ.75 వేలు ఇవ్వాల్సిందేనన్నారు. ఇప్పటికే దశల వారీగా వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేశామన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలకే పథకం వర్తింపజేసి అర్హులకు అన్యాయం చేశారన్నారు. ధర్మవరం నియోజకవర్గంలోనే ఇప్పటికే 10,500 మందికి ‘నేతన్నసేవ’లో సాయం అందించామని ప్రభుత్వం చెబుతోందని, ఆ నిధులు అర్హులకు మాత్రం అందలేదన్నారు. ఇప్పుడు మళ్లీ 10 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని, అవి కూడా అనర్హులకు కట్టబెట్టేందుకే సన్నాహాలు చేస్తున్నారన్నారు. అర్హుల జాబితా ఇప్పటికే తాము సేకరించామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. చేనేతలు అధైర్య పడవద్దని కేతిరెడ్డి భరోసానిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, చేనేత నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

‘నేతన్న సేవ’ పేరుతో పంచుకుతిన్నారు

అర్హులకు అన్యాయం చేశారు

కేతిరెడ్డి ఎదుట చేనేతల ఆవేదన

అధైర్య పడవద్దు...

అండగా ఉంటానని కేతిరెడ్డి భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement