దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగల ముఠా అరెస్ట్‌

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

ధర్మవరం అర్బన్‌: ఆలయాలను టార్గెట్‌ చేసి వరుస చోరీలతో రెచ్చిపోయిన ముగ్గురు సభ్యులు గల ముఠాను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.20.35 లక్షల విలువైన సొత్తు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.

ఏడు ఆలయాల్లో చోరీలు..

ధర్మవరం మండలం పోతుకుంట బీసీ కాలనీకి చెందిన సిల్లా నాగరాజు, అతని కుమారుడు సిల్లా శివ రోజువారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి బుక్కపట్నంలోని కుమ్మరివీధికి చెందిన చింతకాయల నవీన్‌కుమార్‌ పరిచయం అయ్యాడు. ముగ్గురూ కలిసి వివిధ ప్రాంతాల్లో కూలి పనులు చేశారు. ఆ సమయంలోనే సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఇందుకు చోరీలను ఎంచుకున్నారు. అయితే ఇళ్లలో చోరీలకు ప్రయత్నిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన వారు...ఆలయాలను కన్నం వేసేందుకు నిర్ణయించుకున్నారు. సీసీ కెమెరాలు లేని ఆలయాలను టార్గెట్‌ చేసి దోపిడీలకు పాల్పడ్డారు. కనగానపల్లి మండలంలో రెండు దేవాలయాలు, ధర్మవరం రూరల్‌ పరిధిలో మూడు దేవాలయాలు, బత్తలపల్లి మండలంలో రెండు దేవాలయాల్లో దొంగతనాలు చేశారు. ఆలయాల్లో వరుస చోరీలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మవరం డీఎస్పీ జగన్నాథరాజు పర్యవేక్షణలో ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌, చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ, పట్నం ఎస్‌ అర్షద్‌లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరంతా దొంగల కోసం విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలోనే బుధవారం ధర్మవరం మండలం కుణుతూరు గ్రామ శివారులోని ఎస్‌ఎల్‌వి రైస్‌ మిల్‌ సమీపంలో తచ్చాడుతున్న ముగ్గురు నిందితులను ధర్మవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..ఆలయాల్లో జరిగిన వరుస చోరీల గుట్టు వీడింది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారి వద్ద నుంచి రూ.20.35 లక్షల విలువైన 6.750 కిలోల వెండి వస్తువులు, 40 కిలోల ఇత్తడి వస్తువులు, డోలు, ఆరు యాంప్లిఫ్లైయర్లు, రూ.90 వేల నగదు, చోరీలకు ఉపయోగించే కట్టర్‌, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసులను చేధించడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించి సర్టిఫికెట్లు అందించారు. ఆలయాల్లోని బంగారు, వెండి ఆభరణాలను సురక్షితంగా భద్రపరచాలని సూచించారు.

రూ.20.35 లక్షల సొత్తు,

మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement