ఓడీచెరువు: ‘తాగునీటి కోసం అష్టకష్టాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఓడీ చెరువు మండలం దొన్నికోటవారిపల్లిలో మంగళవారం ట్యాంకర్లతో నీటి సరఫరా చేపట్టారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే క్రమంలో ఉంట్లవారిపల్లిలో బోరుబావిలో నుంచి మోటారు తీసి మరమ్మతుల నిమిత్తం తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
గంగప్పకు పెన్షన్ మంజూరు
కదిరి అర్బన్: కదిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేసి 2019 జూన్‌లో రిటైర్డ్ అయిన గంగప్పకు ఎనిమిదేళ్ల అనంతరం పెన్షన్ మంజూరు చేశారు. గంగప్ప సమస్యపై ఈ ఏడాది మే 21న ‘సాక్షి’లో ‘ఎనిమిదేళ్లయినా పెన్షన్ లేదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన అధికారులు కావాల్సిన పత్రాలు తెప్పించుకుని పెన్షన్ మంజూరు చేశారు. ప్రస్తుతం గంగప్పకు నెలకు రూ.3,335 పెన్షన్, అరియర్స్ రూ.2.88 లక్షలు మంజూరు చేశారు. దీంతో గంగప్ప ఆనందం అంతా ఇంతా కాదు.
రోడ్డు ప్రమాదంలో
వైఎస్సార్‌సీపీ నాయకుడి మృతి
మడకశిర రూరల్: మండల సరిహద్దులో కర్ణాటక రాష్ట్రంలోని చంద్రబావి వద్ద సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మడకశిర మండలం జాడ్రపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి నాగభూషణరెడ్డి సోదరుడి కుమారుడు, యువ నాయకుడు అశోక్‌కుమార్‌రెడ్డి (28) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బెంగళూరుకు తరలించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. అశోక్‌కుమార్ రెడ్డి మృతితో జాడ్రపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అశోక్‌కుమార్‌రెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
యువకుడి బలవన్మరణం
పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లిలో యూసూఫ్‌ఖాన్ కుమారుడు మైదీన్ సాబ్ (22) అనే యువకుడు బలవన్మరణం పొందాడు. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూసూఫ్‌ఖాన్, షాహీమ్ దంపతుల పెద్ద కుమారుడు మైదీన్‌సాబ్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయినా, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఫ్యానుకు చీర బిగించి మెడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి షాహీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
బత్తలపల్లి: ప్రాణాంతక వ్యాధులపై యువతకు అవగాహన ముఖ్యమని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్‌కుమార్ పేర్కొన్నారు. శక్తి మైత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా మంగళవారం బత్తలపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీపై యువతకు అవగాహన ఉండాలన్నారు. అంతకు ముందు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరత్నమ్మ, ఎల్‌డబ్ల్యూ ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


