హిందూపురం టౌన్: పుదుచ్చేరిలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించిన 7వ దక్షిణ మండల పెంకాక్ సిలాట్ చాంపియషిప్–2026లో హిందూపురానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హిందూపురానికి చెందిన డి.సానియా సీనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. సీనియర్ విభాగంలో దక్షిణ మండల స్థాయిలో ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. ఈ విజయంతో సానియా జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అలాగే హిందూపురానికి చెందిన జి.రుచిత పోరాట విభాగంలో రజత పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఇరువురు క్రీడాకారులతో పాటు కోచ్ ఎన్‌ఆర్ ప్రవీణ్‌కుమార్‌ను పలువురు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి మరిన్ని పతకాలు సాధించాలని పెంకాక్ సిలాట్ జిల్లా అసోసియేషన్ నాయకులు ఆకాంక్షించారు.
ఇద్దరు అంతర్రాష్ట దొంగల అరెస్ట్
పుట్టపర్తి టౌన్: ఇటీవల సంస్కృతి కళాశాలలో జరిగిన చోరీ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట దొంగలను పుట్టపర్తి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.5 లక్షల నగదు, వాచ్, స్టీల్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూలై 23న బీడుపల్లి సమీపంలో ఉన్న సంస్కృతి కళాశాలలోని అకౌంట్స్ విభాగంలోకి గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి చొరబడి అల్మారాను పగులగొట్టి అందులో భద్రపరచిన రూ.17,45,450 నగదును అపహరించి పరారయ్యారు. ఈ విషయంపై కళాశాల సిబ్బంది అశోక్ పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కోణాల్లో ఆధారాలను సేకరించి ప్రధాన నిందితుడు అలెక్స్ మనోహర్ (మురళీ)ను శనివారం మామమిళ్లకుంట క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.4.5 లక్షల నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగలు.. బిహార్ రాష్ట్రానికి చెందిన కాజూరామ్ అలియాస్ ఆకాష్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ చౌహన్ అలియాస్ బేదిని పుట్టపర్తి ఎయిర్ పోర్టు వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షల నగదు, వాచ్, స్టీల్ రాడ్ స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన అర్బన్ సీఐ యువరాజ్‌తో పాటు సిబ్బంది అశోక్, ఉదయ్‌భాస్కర్, వన్నూరప్ప, నాగరాజు, శ్రీరాములు, మనోహర్, పుల్లప్ప, నరసింహమూర్తి, సుధాకర్, దస్తగిరి, జనార్దన్‌రెడ్డి విశ్వనాథ్, భాస్కర్, చలపతిని డీఎస్పీ సత్యనారాయణ అభినందించారు.


