కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంట గ్రామంలోని వ్యవసాయ పొలాల వద్ద బోరుబావులకు అమర్చిన కేబుల్‌ను దొంగలు చోరీ చేశారు. స్థానిక రైతులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని రైతులు క్రిష్ణారెడ్డి, మంజునాథరెడ్డి, శ్రీరాములుకు చెందిన 3 వ్యవసాయ బోర్ల వద్ద మోటార్లకు అమర్చిన కేబుల్‌ను దొంగలు కత్తిరించుకుని వెళ్లారు. రాత్రి మళ్లీ వచ్చిన దొంగలు బోరుబావుల వద్ద కేబుల్‌ను కత్తిరిస్తుండగా రైతులు గమనించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ద్విచక్ర వాహనంలో వచ్చిన దొంగలు వాహనాన్ని వదిలేసి పారిపోయినట్లు రైతులు తెలిపారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో తామే రాత్రి వేళ పొలాల వద్ద కాపలా ఉంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
● మంత్రి సత్యకుమార్
ధర్మవరం అర్బన్: ధర్మవరం యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం జాబ్‌మేళా ప్రక్రియ జరుగుతూనే ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పట్టణంలోని సీఎన్‌బీ ఫంక్షన్ హాలులో మంగళవారం సంస్కృతి సేవా సమితి సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి సత్యకుమార్‌యాదవ్, ప్రభుత్వ గౌరవ సలహాదారు సతీష్‌రెడ్డి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో యువతకు విద్య, నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలను అందించాలన్న సంకల్పంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న యువతకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో సంస్కృతి సేవా సమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, జనసేన ఇన్‌చార్జ్ చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘కేసుతో సంబంధం లేదు’
రాప్తాడు రూరల్: ఇటీవల కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో అనంతపురం రూరల్ మండలం జంగాలపల్లికి చెందిన శ్రీకాంత్ అరెస్టయినట్లు వచ్చిన వార్తతో తనపై అపోహలు ఏర్పడుతున్నాయని అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. తాను హైదరాబాద్‌లో అనస్తీషియా విభాగంలో పని చేస్తున్నానని, ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామం, పేరు సరిపోవడంతో కొందరు తననే నిందితుడిగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచార లోపంతో తన గ్రామం పేరు వార్తల్లో వచ్చి ఉండవచ్చని పేర్కొన్నాడు.


