ధర్మవరం రూరల్: తాను సాగు చేస్తున్న పొలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు కంభం చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన మేరకు.. సర్వే నంబర్ 103–2లోని 4.03 ఎకరాల భూమిలో చంద్రమ్మ 20 ఏళ్లుగా కంది, ఉలవ, వేరుశనగ పంటలు సాగు చేస్తోంది. 2007లో రెండు ఎకరాల 52 సెంట్లకు ప్రభుత్వం డీ పట్టా ఇచ్చింది. మిగిలిన ఎకరా 50 సెంట్లలోనూ ఆమె 20 ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి భూమిలో ఉన్న రాళ్లు, గుట్టలు తొలగించి సాగు భూమిగా మార్చింది. ఈ ఏడాది పొలంలో కంది పంట సాగు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రమ్మ భూమిపై కొందరి కన్ను పడింది. వెంకటలక్ష్మి అనే పేరు మీద నకిలీ పట్టా తెచ్చుకున్నారు. కొన్ని రోజులుగా ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్డీఓ కోర్టులో కేసు వేసినా పొలాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మహిళా రైతు కోరారు.
మహిళా రైతు ఆవేదన


