అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి ఏపీ వెటర్నన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఆదివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోర్నీ వివరాలను వెటర్నన్స్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.విజయరాజు వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఈ టోర్నీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. క్రీడాకారులకు జెర్సీలను కూడా అందిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు విభాగాధిపతితో సంతకం చేయించి ఈ నెల 13వ తేదీలోపు అనంతపురంలోని కమలానగర్‌లో ఉన్న అంకుశం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 94900 62555ను సంప్రదించవచ్చన్నారు.
ఔదార్యం చాటుకున్న మిత్రులు
కదిరి అర్బన్: స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తలా ఓ చేయి వేసి బతుకుదెరువు కోసం ఆటో కొనిచ్చి కుటుంబాన్ని ఆదుకున్నారు. కదిరి పట్టణంలోని వేమన బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988 – 89 బ్యాచ్ 10వ తరగతి చదివిన విద్యార్థులు తమ మిత్రుడు చిదానందప్ప కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆటో అందజేశారు. మొత్తం 80 మంది మిత్రులు కలసి రూ.2,80,000 వేలు ఆర్థికసాయం చేసి కొత్త ఆటోను కొనిచ్చారు. ఎవడు ఎలా ఉంటే మనకేంటి.. మనం బాగుంటే చాలు అని బతికేసే ఈ కాలంలో ఇలాంటి మిత్రులు ఉండడం సంతోషకరమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మస్తాన్‌వలీ, శ్రీనాథ్‌రెడ్డి, ఆది, గంగరాజు, మోహన్‌రావ్, బాబా, అక్బర్, ప్రసాద్, షంషీర్, కృష్ణానాయక్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని
వ్యక్తి మృతదేహం లభ్యం
ధర్మవరం అర్బన్: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని వ్యవసాయ భూమిలో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని, పర్పుల్ రంగు షర్ట్, నీలం రంగు లుంగీ, గ్రే రంగు అండర్‌వేర్ ధరించాడని టూటౌన్ సీఐ జయనాయక్ తెలిపారు. వివరాలు తెలిసినవారు, కుటుంబ సభ్యులు వెంటనే టూటౌన్ సీఐ 6305800429, ఎస్‌ఐ 9848424349 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.


