విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

పుట్టపర్తి అర్బన్‌: చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్జేడీ శామ్యూల్‌, డీఈఓ కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, అధికారులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వారి కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యారంగంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని, ఈ గొప్పతనం మన ఉపాధ్యాయులదే నన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్నింటికంటే ముందు క్రమశిక్షణ నేర్పించాలన్నారు. ఇక సాంకేతిక పెరిగిపోవడంతో ఉపాధ్యాయుల్లో ఒత్తిడి మరింత పెరిగిందన్నారు. యాప్‌లతో ఇబ్బంది పడుతున్నారని, పని ఒత్తిడి, టెట్‌ సమస్యలు...ఇలా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం ముందుంచామని, త్వరలోనే మంచి సంకేతాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంపై పలు విమర్శలు వస్తున్నాయన్నారు. సరఫరాదారులంతా ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

జాతి నిర్మాతలు ఉపాధ్యాయులే..

జాతి నిర్మాతలు ఉపాధ్యాయులేనని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. విద్యార్థుల్లో విలువలు పెంచేలా బోధన సాగాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై తల్లిదండ్రులే చర్యలు తీసుకుంటే మంచిదన్నారు. సెల్‌కు బానిసలుగా కాకుండా సమాజానికి నిర్దేశకులుగా తీర్చి దిద్దాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రలకు హితబోధ చేశారు.

వలసలు పెరిగి హాజరు తగ్గింది..

జిల్లాలో వలసలు పెరగడంతో స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం తగ్గిందని ఆర్జేడీ శామ్యూల్‌ అన్నారు. జిల్లాలో 8 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా హాజరు 99 శాతం ఉందన్నారు. కానీ విద్యార్థుల హాజరు మాత్రం 89 శాతమే ఉందన్నారు. హాజరు శాతం పెంచాలన్నారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో క్రమ శిక్షణ పెరగాలన్నారు.

ఉపాధ్యాయులకు క్రమశిక్షణ ముఖ్యం

ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి

‘మంగళకర’లో ఉపాధ్యాయ దినోత్సవం

54 మందికి ఉత్తమ ఉపాధ్యాయ

పురస్కారాల అందజేత

ఉపాధ్యాయులకు అవమానం

గురుపూజోత్సవం రోజున జిల్లా ఉపాధ్యాయులకు తీవ్ర అవమానం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆహ్వానాలు పంపడంతో పాటు కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. అయితే కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా... 2 గంటలు ఆలస్యంగా 3.30 గంటలకు ప్రారంభమైంది. పైగా ఉపాధ్యాయులు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకపోవడంతో వారంతా గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ డీఈఓ కిష్టప్పపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు కుర్చీలు తెప్పించారు. దీంతో పాటు సుమారు గంటన్నరకుపైగా ప్రసంగాలతో విసుగు తెప్పించారు. సన్మాన కార్యక్రమం కూడా చాలా దారుణంగా సాగింది. అవార్డు గ్రహీతలను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులను నిల్చోబెట్టే సత్కరించడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement