● 25 నుంచి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
అనంతపురం న్యూటౌన్: శ్రీసత్యసాయి జిల్లాలో నూతన జిల్లా పరిషత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్‌ల పునర్విభజనకు సంబంధించి 114 నంబరు ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుతమున్న జిల్లా ప్రజా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగయనుంది. ఆ మరుసటి రోజు అంటే సెప్టంబర్ 25వ తేదీ నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్‌లు అమల్లోకి రానున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల స్థానంలో పరిపాలనా సౌలభ్యం కోసం 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పాత జిల్లా కేంద్రాలుగానే ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్తులుగా పాలనను కొనసాగిస్తూ వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో రెండు జిల్లాను అదనంగా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో 28 జిల్లాలయ్యాయి. అనంతపురం నుంచి దక్షిణ ప్రాంతాన్ని విడగొట్టి పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జెడ్పీ పాలన మాత్రం ఉమ్మడి అనంతపురం నుంచే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 32 మండలాలతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజా పరిషత్ పాలన ఈ నెల చివరి వారం నుంచి అమల్లోకి రానుంది.
ఇసుక టిప్పర్ల అడ్డగింత
ముదిగుబ్బ: నదిలోని ఇసుకను అక్రమంగా తరలించడంతో పాటు అధికలోడుతో వెళ్తూ తమ గ్రామ రహదారిని దారుణంగా దెబ్బతీస్తున్న ఇసుక టిప్పర్లను పీసీరేవు గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని పీసీరేవు ఇసుక రీచ్ నుంచి కొందరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా సిమెంట్ పైపులు వేసి ఇసుక వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ... ఇసుక టిప్పర్ల వల్ల రహదారులు ఛిద్రం అవుతున్నాయన్నారు. ఇష్టానుసారం ఇసుక తరలింపుతో నదీ పరివాహాక ప్రాంతంలో భూగర్భ జలమట్టం అడుగంటిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
తలుపుల: గంజాయి విక్రయిస్తున్న ఓ జంటను పోలీసులు శనివారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5.430 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ చెన్నయ్య తెలిపిన వివరాల మేరకు...మండలంలోని పూలవాండ్లపల్లికి చెందిన నారాయణ, శాంతమ్మ దంపతులు. వారు తమ ఇంటి వద్దే 12 గంజాయి మొక్కలు పెంచుతున్నారు. తరచూ గంజాయి పంటను కోసి ఇతరులకు విక్రయిస్తూ ఉండేవారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం తహసీల్దార్ మురళీకృష్ణ, ఆర్‌ఐ శ్రీనివాస్, ఏఓ నాగమధుసూదన్ సమక్షంలో నారాయణ దంపతుల ఇంటిపై దాడులు నిర్వహించారు. దంపతులపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేశారు. అనంతరం వారు సాగుచేస్తున్న 5.430 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే విక్రయానికి సిద్ధం చేసి ఇంట్లో దాచి ఉంచిన మరో 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కబ్జాకు గురైన వంక స్థలం సర్వే
కదిరి టౌన్: కబ్జాకు గురైన సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలాన్ని శనివారం అధికారులు సర్వే చేశారు. సదరు స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకుడు కబ్జా చేసి భూమిని చదును చేసిన వైనంపై ‘వంకనూ వదల్లేదు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు శనివారం ఉదయం అక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేశారు. వంక పోరంబోకు భూమిని ఎవరు ఆక్రమించినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఇరిగేషన్ ఏఈ మహేష్ తెలిపారు.


