అలంకరణలో శనీశ్వరస్వామి , శీతలాంభదేవి, కాకి వాహనం
పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయంలో శ్రావణ బహుళ నవమి చివరి శ్రావణ శనివారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వరస్వామి, శీతలాంభదేవి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4 గంటల నుంచి శనీశ్వరునికి పంచామృతాభిషేకం, తైలాభిషేకం, నవ గ్రహ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం పై అంతస్తులోని ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేసిన నవగ్రహ పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొని శనీశ్వర పారాయణం ఆలకించి తరించిపోయారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్ని గుండంలోకి భక్తులు నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు, నల్ల వత్తులు సమర్పించి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. మూడు శ్రావణ శనివారాల కంటే చివరి నాల్గవ శ్రావణ శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్యంగా చిత్రదుర్గం, చెళ్లకెరె, దావణగెరె, శివమొగ్గ ప్రాంతాల నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీక్ష మంటపంలో భక్తులు శనీశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అన్నపూర్ణ భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాద వినియోగంలో భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ సురేశ్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సమితి పదాధికారులు, ఆలయ సిబ్బంది, వలంటీర్లు సేవలందించారు.


