గుంతకల్లు: స్థానిక తాటాకుల వీధికి చెందిన రాజేశ్వరి (33) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి బోయ లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజేశ్వరికి 15 ఏళ్ల క్రితం నేమకల్లు మద్దిలేటితో వివాహం జరిగింది. సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ తల్లి లక్ష్మీదేవితో రాజేశ్వరి చెప్పుకుంటూ బాధపడుతుండేది. శనివారం ఉదయం సెంట్రింగ్ పనికి మద్దిలేటి వెళ్లగా.. చిన్న కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. పెద్ద కుమారుడు శ్యామ్‌కుమార్ కూడా బయటకు వెళ్లిన సమయంలో జీవితంపై విరక్తి చెందిన రాజేశ్వరి బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అప్పడే ఇంటికి వచ్చిన కుమారుడు శ్యామ్‌కుమార్ బెడ్ రూమ్ తలుపులు ఎంత కొట్టినా రాజేశ్వరి తెరవకపోవడంతో సమీపంలోనే ఉన్న మామ కృష్ణకు చెప్పాడు. ఆయన తలుపులు పగులగొట్టి వెంటనే రాజేశ్వరిని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు
ఉరవకొండ:మండలపరిధిలోని పెద్దముస్టూరు గ్రామానికి చెందిన చరణ్‌తేజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మహనంది యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన మేరకు.. బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించిన చరణ్‌తేజ్ గత నెల 10న బెంగళూరుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో చరణ్ గత నెల 18న ఇంటి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొన్న బొలెరో
● ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
రాయదుర్గం రూరల్/బెళుగుప్ప: రాయదుర్గం మండలంలోని కాశీపురం గేటు వద్ద శనివారం సాయంత్రం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రామ్‌చరణ్, అభిరామ్, గోపాల్‌లు రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా, రాయదుర్గం–అనంతపురం జాతీయ రహదారిపై బొలెరో ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు గుండ్లపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రాయదుర్గం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెలరేగిన అనంత బ్యాటర్లు
అనంతపురం: ఏసీఏ సౌత్ జోన్ అండర్ 23 పురుషుల మల్టీడే క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో అనంత బ్యాటర్లు చెలరేగిపోయారు. నెల్లూరుపై భారీ స్కోర్ సాధించారు. అనంత క్రీడాగ్రామంలోని ఆర్‌సీజీ మైదానం వేదికగా అనంతపురం, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 450 పరుగులు సాధించింది. జట్టు బ్యాటర్లు పి.విశ్వవికాస్ 238 బంతుల్లో 20 ఫోర్లు 5 సిక్సర్లతో 161 పరుగులు సాధించాడు. మరో బ్యాటర్ వెంకట్‌లోకేష్ 126 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు, హనీష్ వీరారెడ్డి 94 పరుగులు సాధించారు. నెల్లూరు బౌలర్లలో అఖిల్ 5, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు.
● ఏసీజీ మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో వైఎస్సార్ కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను చాలా పేలవమైన ఆటతీరుతో చతికిలపడింది. కేవలం 26.2 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌట్ అయింది. కర్నూలు బౌలర్లలో అక్షిత్‌రెడ్డి ఐదు, సబ్జాన్‌బాషా 5 వికెట్లు చొప్పున కూలదోసి, కడప బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 37.3 ఓవర్ల వద్ద 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులకు ఆటను డిక్‌లైర్ చేసింది. కర్నూలు బ్యాటర్లు సాయి సూర్యతేజారెడ్డి 76, రోహిత్‌గౌడ్ 67 పరుగులు సాధించారు. కడప బౌలర్లలో ఆదిల్‌హుస్సేన్ 5, మహమ్మద్ అస్లాం 4 నాలుగు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు ఆట ముగిసే సమయానికి పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు సాధించింది.


