చిలమత్తూరు: మండల పరిధిలోని వీరాపురం, సోమఘట్ట పంచాయతీల్లో వీఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటసాయిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు వెంకటసాయిపై పలు అవినీతి ఆరోపణలు రావడం, సామాన్యులు, అమాయకులతో డబ్బు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు, అదే విధంగా విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ
ఎన్‌పీకుంట: మండల పరిధిలోని గౌకనపల్లి గ్రామంలో శనివారం ఉదయం రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన టి.బయప్ప, జల్లా శివమోహన్‌రెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు.. శనివారం గ్రామస్తులంతా వనభోజనాలకు వెళ్లారు. టి.బయప్ప భార్య చంద్రమ్మ వనభోజన కార్యక్రమం నుంచి తమ ఇంటి పక్కన ఉన్న వృద్ధుడు గంగిరెడ్డికి భోజనం ఇవ్వడానికి ఉదయం 11 గంటలకు ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.1.38 లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు జతల వెండి పట్టీలు దొంగిలించినట్లు గుర్తించారు. అలాగే జల్లా శివమోహన్‌రెడ్డి ఇంటిలోని బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.20,000 నగదు అపహరించుకు పోయినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించినట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.
● నాలుగు రోజుల క్రితమే మండలంలోని వెలిచలమల గ్రామంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన మరవక ముందే మరో రెండు ఇళ్లలో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఎస్పీకి ఫిర్యాదు
పుట్టపర్తి టౌన్: కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు గూలూరు మహాసంస్థానం ప్రతినిధి నరసింహమూర్తి తెలిపారు. శనివారం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి గ్రామంలో 750 ఏళ్ల చరిత్ర కలిగిన జంగమ మఠం, వీరభద్రస్వామి దేవాలయం వివాదాస్పదంగా మారిందన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి నకిలీ తాళాలతో దేవాలయం తెరిచి పూజలు చేస్తున్నారన్నారు. మఠం భూములు తన పేరుపైకి మార్చుకున్న నిడిమామిడి వాసి వీరభద్రునిపై మూలమఠం ప్రతినిధులు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 6,7 తేదీల్లో నిడిమామిడిలో తలపెట్టిన కార్యక్రమం నిలుపుదల చేయాలని పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. భక్తులు రూ.70 లక్షల విరాళాలు సేకరించి శిథిలమైన దేవాలయాన్ని 2021–25 సంవత్సరంలో పునరుద్ధరించి ఫిబ్రవరిలో ప్రతిష్ట చేశారన్నారు. పూజల కోసం శిక్షణ పొందిన అర్చకుడు కరిబసయ్యను నియమించామని, అయితే, గతంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన వీరభద్రడు తానే అర్చకుడని కొత్త అర్చకునిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై పుట్టపర్తి కోర్టులో మార్చిలో కేసు వేయగా, కోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ పాత పూజారి పూజలు చేయడానికి అనుమతులు ఇచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నకిలీ తాళాలతో వీరభద్రుడు దేవాలయంలో పూజలు చేస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో నిడిమామిడి జగద్గురు మఠం కార్యదర్శి రత్నకుమార్, గూలూరు మహా సంస్థానం ప్రతినిధి వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.


