మడకశిర: కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ దళిత యువకుడు మడకశిర మండలంలోని యూరంగాపురం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పావగడ తాలూకా నల్లిగానపల్లికి చెందిన చిరంజీవి(28)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కరెంట్ షాక్‌తో మృతి చెందాడా..?
చిరంజీవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మడకశిర మండలం దాసప్పపాళ్యం గ్రామానికి చెందిన ఓ యువకుడు, చిరంజీవి స్నేహితులు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఇద్దరూ కలిసి రెండు రోజుల క్రితం రాత్రి మడకశిర మండలం నీలకంఠాపురం సమీపంలో గల కర్ణాటక రాష్ట్రం లక్ష్మీపురం వద్ద ఓ రైతు తోటలో మద్యం సేవించడానికి వెళ్లారు. తోట యజమాని అడవి పందులు రాకుండా కరెంట్ తీగలను ఏర్పాటు చేసిన విషయం తెలియక వెళ్లిన చిరంజీవి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలోనే తోట యజమాని కేసు తనపైకి వస్తుందని భావించి చిరంజీవి మృతదేహాన్ని యువకుడి సహాయంతో వాహనంలో తీసుకువచ్చి మడకశిర మండలం యూరంగాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. అయితే, సదరు యువకుడు భయపడిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐ కృష్ణారెడ్డి అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మడకశిరకు చేరుకున్నారు. మృతదేహం వద్ద బోరున విలపించారు. చిరంజీవి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. మృతుడి తల్లిదండ్రులు గోవిందప్ప, భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. హత్య కోణంలో విచారిస్తున్నామన్నారు.
ధర్మవరంలో ప్రైవేటు టీచర్..
ధర్మవరం రూరల్: నాగలూరు గ్రామంలో శనివారం ఓ ప్రవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ కేవీ మ్యాథ్యూస్ (60) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ రాష్ట్రం వాయనాడ్‌కు చెందిన మ్యాథ్యూస్ నాగలూరులో ఉన్న ఓ ప్రవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం ఉదయం గదిలో నుంచి ఆయన బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారు అనుమానం వచ్చి ఇంట్లో చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధిక రక్తపోటు కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. శరీరంలో ఎక్కడా గాయాలు లేకపోవడంతో అధిక రక్తపోటు కారణంగా మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. వారు కేరళ రాష్ట్రంలోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుని సోదరుడు కేవీ షాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.


