పుట్టపర్తి టౌన్: ఇటీవల సంస్కృతి కళాశాలలో జరిగిన చోరీ కేసును పుట్టపర్తి అర్బన్ పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అలెక్స్ మనోహర్ పవార్ (మురళీ)ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.4.5 లక్షల నగదు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ 2026 జూలై 23న బీడుపల్లి సమీపంలో ఉన్న సంస్కృతి కళాశాలలో అకౌంట్స్ విభాగంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అల్మారాను పగుల గొట్టిన అనంతరం అందులో భద్రపరచిన రూ.17,45,450 అపహరించి పరారయ్యారు. ఈ విషయంపై కళాశాల సిబ్బంది అశోక్ పుట్టపర్తి అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా గుజరాత్‌కు చెందిన అలెక్స్ మనోహర్ అలియాస్ మురళి, బిహార్‌కు చెందిన కాజురామ్ ఆకాశ్, హర్యానాకు చెందిన బేడి అజయ్ చౌహాన్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు అలెక్స్ మనోహర్‌ను శనివారం మామిళ్లకుంట క్రాస్ వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం సమీపంలో అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ. 4.5 లక్షల నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకునేదని, అడ్మిషన్ల సమయంలో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని గుర్తించి చోరీలకు పాల్పడేవారన్నారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన అర్బన్ సీఐ యువరాజ్‌తోపాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు, కళాశాలల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, నగదు, బంగారు తదితర విలువైన వస్తువులను సురక్షితంగా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


