కదిరి టౌన్: శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 10 గంటల నుంచి ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయంలోని కల్యాణ వేదిక పైన అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి ఆలయ అధికారులు సమకూర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎ.డి.పార్థసారథి చార్యులు మహిళల చేత వ్రతాన్ని ఆచరింపజేయించి, వ్రత విశిష్టతను తెలియజేశారు. పూజల్లో దాదాపు 400 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, మహిళలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


