హిందూపురం టౌన్: గంజాయి విక్రయించిన, వినియోగిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఎస్పీ మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హిందూపురం రూరల్, టూటౌన్‌న పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది ప్రత్యేక దాడులు చేశారన్నారు. శ్రీకంఠపురం సమీపంలోని వివేకానంద స్కూల్ వద్ద గంజాయి సేవిస్తున్న ముక్కడిపేటకు చెందిన ఎస్.గౌతమ్, శ్రీకంఠపురానికి చెందిన కె.అరుణ్ కుమార్‌ను హిందూపురం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. గంజాయిని ఇతర వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు వారు వెల్లడించగా, దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి 14.53 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా హిందూపురం ఆర్టీఓ కార్యాలయ సమీపంలో ఆటోనగర్‌కు చెందిన బాబా, లక్ష్మీపురానికి చెందిన మనోజ్ కుమార్ అలియాస్ మామ గంజాయి సేవిస్తుండగా..టూటౌన్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత, విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గంజాయికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ప్రసాద్‌బాబు, టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం, ఎస్‌ఐలు రాజేష్, మునీర్ అహ్మద్, వీరాంజినేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా విక్రయం..
హిందూపురంలో గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏఎస్పీ మహేష్ తెలిపారు. గంజాయిని కర్ణాటక, వైజాగ్ నుంచి కిలోల వారీగా అక్రమంగా రవాణా చేసి ఇక్కడ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి గుర్తించేందుకు ప్రత్యేక టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ప్రస్తుతం హిందూపురంలో ఈ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులతో పాటు వినాయక నిమజ్జనం సమయంలోనూ భారీగా టెస్టులు నిర్వహించి, గంజాయి వినియోగిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెల్లడించారు. వినాయక నిమజ్జనంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నలుగురు అరెస్ట్
1.6 కేజీల గంజాయి స్వాధీనం


