లేపాక్షి: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని 31 దేశాల మహిళా ప్రతినిధులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. పాలసముద్రం వద్ద ఉన్న నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్) ‘ప్రజా సేవలో నాయకత్వాన్ని ఆచరించడం’ అనే అంశంపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 31 దేశాల నుంచి 47 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. వారంతా శుక్రవారం ఉదయమే లేపాక్షికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వామి, పాపనాశేశ్వర, రఘునాథస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వైభవం, శిల్పా కళా చాతుర్యం చూసిన మహిళా ప్రతినిధులు అబ్బురపడ్డారు. రాతి విగ్రహాలు, ఆలయ నిర్మాణ నైపుణ్యం చూసి ముగ్ధులయ్యారు. ఒక్కో విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించి చరిత్ర అడిగి తెలుసుకున్నారు.


