కదిరి మండలం కాళసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రిష్ణవేణి ఎస్జీటీగా పని చేస్తున్నారు. బోధించడంతోనే టీచరు బాధ్యత తీరదని భావించే ఆమె విద్యార్థుల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తున్నారు. తన జీతంతో తాను పని చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో అవసరాలు తీర్చారు. ప్లేట్లు, గ్లాసు, బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, ఇలా చాలావరకు విద్యాసామగ్రిని తన సొంత నిధులతో కొనిచ్చారు. కేన్సర్ మహమ్మారి కబలిస్తున్నా..ఆత్మస్థైర్యంతో ముందుకుసాగుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. భర్త సహకారంతో విద్యార్థులకోసం ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకత వెలికితీసి వారితోనే చేతివృత్తులకు సంబంధించి పరికరాలను తయారు చేయిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారు తమ సొంతకాళ్లపై నిలబడేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతున్నారు.


