పుట్టపర్తి: పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువును కలుపుతూ రూ.200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఔటర్ రింగ్ రోడ్డుపై గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కూడా ఈ అంశమే అజెండాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేస్తామని, బుక్కపట్నం నల్లనమ్మ గుడి వద్ద చిత్రావతి మరువ వంకకు బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్లు గడచినా ఎలాంటి ప్రణాళికలు తయారు చేయలేదని ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
మళ్లీ మళ్లీ మోసం..
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలను వంచించడం పరిపాటిగా మారింది. 2014–19 సమయంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లోనే పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడంతో పాటు బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేస్తామని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఎలాంటి ప్రతిపాదనలు తయారు చేయలేదు. దీంతో రెండో సారీ పుట్టపర్తి ప్రజలకు బాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పుట్టపర్తి ప్రజలకు
చంద్రబాబు ప్రభుత్వ మోసం
ఔటర్ రింగ్ నిర్మాణాన్ని
గాలికొదిలిన వైనం
పట్టించుకోని ఎమ్మెల్యే పల్లె సింధూరా
మండిపడుతున్న ప్రజలు
ఇదే మొదటి సారి కాదు..
పుట్టపర్తి–బుక్కపట్నం–కొత్తచెరువును కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి. బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా విగ్రహం ఏర్పాటు చేయాలి. దీంతో పర్యాటకంగానూ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చొరవ చూపాలి. టీడీపీకి ప్రజలను మోసం చేయటం కొత్త కాదు. గతంలోను హామీ ఇచ్చి మోసం చేశారు.
– నారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్, పుట్టపర్తి


