పుట్టపర్తి అర్బన్: అప్పటి వరకూ ఎంతో చలాకీగా పని చేస్తూ ఉన్న ఓ ఉపాధి కూలీ పనులు చేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మండలం పైపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరిజన ఓసూరప్ప (73) రోజూలాగే వీబీజీరామ్‌జీ పనులకు మంగళవారంవెళ్లాడు. అదే గ్రామానికి చెందిన కేశప్ప పొలంలో మామిడి మొక్కలు నాటడానికి గుంతలు తీస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కూలీలు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఏపీఓ వరప్రసాద్ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, కూలీలు కోరారు. ఓసూరప్పకు ఇది వరకే భార్య మృతి చెందగా ముగ్గురు బిడ్డలూ పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోయారు.
మద్యం మత్తులో డ్రైవింగ్.. యువకుడికి జైలు
ఎన్‌పీకుంట: మండల కేంద్రానికి చెందిన ఇడగొట్టు ప్రశాంత్ అనే యువకుడు మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పట్టుబడ్డాడని ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లు గుర్తించామని, నిందితుడిని కదిరి జ్యుడీషియల్ సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జీ 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
పురం వన్‌టౌన్ ఏఎస్‌ఐపై వేటు
హిందూపురం టౌన్: హిందూపురం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ ధనుంజయపై ఎస్పీ సతీష్‌బాబు వేటు వేశారు. పలు ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్ నాగాంజనేయులుపై కూడా వేటు వేశారు. ఈ విషయాన్ని ఏఎస్పీ మహేష్ ధ్రువీకరించగా, వీరిని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సరెండర్ చేసినట్టు ఆయన తెలిపారు.
మల్లాపల్లిలో డీపీఓ పర్యటన
గోరంట్ల: మండల పరిధిలోని మల్లాపల్లి పంచాయతీలో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి సమత పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త శుద్ధి కేంద్రాన్ని ఎంపీడీఓ కమలబాయితో కలిసి పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీపై పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరతపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూధన నాయక్, మండల విద్యాశాఖ అధికారి జాన్‌రెడ్డప్ప, రక్షిత మంచి నీటి శాఖ ఇంజినీర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ వేతనాల కోసం ఆకులు తిని నిరసన
ఓడీచెరువు: మండల కేంద్రంలో పని చేస్తున్న పంచాయతీ కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆకులు తిని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీతాలు ఇవ్వాలని పలు మార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. కార్మికులు ఏమి తిని బతకాలని, అందుకే ఆకులు తిని నిరసన కార్యక్రమం చేపట్టనట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ రమణ, నాయకులు కుళ్లాయప్ప, అంజనప్ప, గంగులప్ప, నాగమ్మ, నిర్మల, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఆవు దాడిలో వృద్ధురాలి మృతి
వజ్రకరూరు: ఆవు దాడిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొనకొండ్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. కొనకొండ్ల ఇందిరమ్మ కాలనీకి చెందిన నెట్టికంటమ్మ (70) మంగళవారం ఇంటి వద్ద నుంచి సమీపంలోని దుకాణానికి వెళుతుండగా వెనుక వైపు నుంచి ఆవు దాడి చేసింది. దీంతో గాయపడిన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధురాలు మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
● అదే ఆవు దాడిలో మరో మహిళ గాయపడినట్లు తెలిసింది. ఇద్దరిపై దాడి చేసిన ఆవు కూడా మరణించడం గమనార్హం. ఈ ఆవు గ్రామంలోని ఓ దేవాలయానికి చెందినదిగా గ్రామస్తులు చెబుతున్నారు.


