హిందూపురం టౌన్: పట్టణంలోని హస్నాబాద్‌కు చెందిన ఆసీఫ్(30) మంగళవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు హస్నాబాద్‌కు చెందిన ఆసీఫ్‌తో భార్య ముస్కాన్ మనస్పర్థల కారణంగా మంగళవారం 8 ఏళ్ల కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. వారిని ఫోన్‌లో సంప్రదించినా అందుబాటులోకి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆసీఫ్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో వారు గుర్తించి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అలాగే మృతుడి భార్య, కుమార్తె కనిపించడం లేదని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే వారు బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది.
పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి
రొళ్ల: పాడి పరిశ్రమపై దృష్టి సారించి డెయిరీ ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలని మహిళ డెయిరీ సహకార సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ నారాయణమ్మ, జిల్లా మహిళ డెయిరీ సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్లు శివశంకర్‌నాయక్, హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలం పరిధిలోని ఎల్‌కే పల్లివడ్రహట్టి గ్రామాల్లో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళ డెయిరీ సహకార సంఘం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో మహిళ డెయిరీ సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. బ్యాంకు ద్వారా రుణ సదుపాయం, పశువైద్య శాఖ ద్వారా దాణా, విత్తనాలు అందిస్తామన్నారు. మహిళలు పాడిపరిశ్రమ వైపు ఆసక్తి పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఏమైన సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్న పశువైద్యశాఖ సిబ్బందిని సంప్రదింపులు జరుపుకుని పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో పశువైద్యశాఖ ఏడీ అమర్, ఎల్‌ఎస్‌ఏ శశికళ, ఏహెచ్‌ఏలు కవిత, మహలింగప్ప, కుమార్‌నాయక్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
కళ్యాణదుర్గం: పట్టణంలోని సిద్దప్ప వంక వీధికి చెందిన బిల్లి పవన్ కుమార్ (36) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు... సిద్దప్ప వంక వీధికి చెందిన బిల్లి పవన్ కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని భార్య తులసి అలియాస్ చిట్టి సైతం ఏడాది క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక దివ్యాంగురాలైన కుమార్తె ఉంది.


