చిలమత్తూరు: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నాగలక్ష్మి అనే గాజుల వ్యాపారి గృహంలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. వివరాలు.. మంగళవారం మధ్యాహ్నం నాగలక్ష్మి కుమారుడు నాగరాజు రెగ్యులేటర్ సరిగా వేయకపోవడంతో గ్యాస్ లీకేజీ మొదలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంచితో మంటలు ఆర్పడానికి యత్నించగా, చేయి కాలడంతో భయపడి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో క్షణాల్లో ఇల్లంతా మంటలతో నిండిపోయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే ఇల్లంతా దగ్ధమైంది. ఇంట్లో సామగ్రి, బియ్యం, బీరువా మొత్తం కాలిపోయింది. రూ.లక్షల విలువ చేసే గాజులు, బీరువాలోని బంగారం, రూ.3 లక్షల నగదు కాలి బూడిదయ్యాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగలలేదంటూ బాధిత మహిళ నాగలక్ష్మి బోరున విలపించింది.


