రొళ్ల: ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకంగా ఉంటుందని, దీని వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనాలు లేని పంటలను ప్రజలకు అందించవచ్చని పలువురు పేర్కొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఆగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఏకేఆర్‌ఎస్‌పీ) 30 మంది ప్రతినిధుల బృందం మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. దొడ్డేరి, నసేపల్లి తదితర గ్రామాల్లో కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఅండ్‌ఐఓ) లక్ష్మానాయక్, స్థానిక వ్యవసాయశాఖ అధికారి వెంకటబ్రహ్మంతో కలిసి పర్యటించారు. నసేపల్లిలో మహిళా రైతులు లక్ష్మమ్మ, సిద్ధమ్మలు వక్కతోట, మామిడి తోటలో అంతర పంటగా సాగు చేసిన కంది, గోరు చిక్కుడు, వేరుశనగ, ఏటీఎం, పీఎండీఎస్ పంటలను పరిశీలించి, వాటి విధానాలను అడిగి తెలుసుకున్నారు. దొడ్డేరిలో రైతు గోవిందరెడ్డి పొలంలో ఏటీఎం పద్ధతిలో సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే బీజామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, విత్తన గుళికలు, విత్తన శుద్ధి ఇతరత్ర ఘన, ద్రవ విధానం తయారీ, జీవామృతాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పాటు నిరంతరం పంటలు పండిస్తూ లాభాలు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో జాతీయ వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఓ) అధిపతి వి.కృష్ణారావు, టెక్నికల్ ఏఓ హుమాయన్, వైఈఎల్ సంతోష్, ఎన్‌ఆర్‌ఓ బృందం చెందిన సయ్యద్‌దాదాఫీర్, ఏపీసీఎన్‌ఎఫ్ బృందం ఎస్‌పీఎం నవీన్, ఎంటీ రమేష్, హనుమంతరాయప్ప, ఆర్‌వైఎస్‌ఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


