పేరుకు ఒకటే మద్యం దుకాణం.. కానీ అనుబంధంగా 20కి తక్కువ కాకుండా బెల్టుషాపులు.. బాటిల్‌పై అ‘ధన’పు బాదుడు. 24 గంటలూ అమ్మకాలతో
ఈ రెండేళ్లలో మద్యం దుకాణాలు
నడుపుతున్న కూటమి పార్టీల నాయకులు భారీగానే ఆర్జించారు. కానీ తాజాగా గల్లాపెట్టెకు కిక్కుసరిపోలేదు.. ఇంకో ఏడాది లీజు పెంచండంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. లీజు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ‘తమ్ముళ్ల’ వద్దే దుకాణం ఉంటే...మద్యంతో జనాన్ని ముంచేసి ఓట్లు రాబట్టవచ్చని
కొందరు ప్రభుత్వ పెద్దలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
సాక్షి, పుట్టపర్తి
మద్యం వ్యాపారంలో ఇప్పటికే భారీగా ఆర్జించిన అధికార పార్టీ నేతలు, అనుయాయులు దుకాణాల లీజు గడువు ముగుస్తున్న వేళ ‘నష్టాల రాగం’ అందుకున్నారు. లైసెన్స్ ఫీజు భారీగా చెల్లించామని, రెండేళ్లలో పెద్దగా మిగల్లేదంటూ మొసలికన్నీరు కారుస్తున్నారు. మద్యం దుకాణాల లీజు వచ్చే అక్టోబరు 2వ తేదీ నాటికి ముగియనుండగా.. లీజు గడువు పెంచి మళ్లీ పాతవారికే దుకాణాలు ఇచ్చేలా చూడాలంటూ మంతనాలు సాగిస్తున్నారు.
ఏడాది పొడిగింపునకు సన్నాహాలు..
జిల్లాలోని మద్యం దుకాణాల్లో 80 శాతం కూటమి పార్టీల నాయకులవే. మిగతా దుకాణాల్లో కూడా వాటాలున్నాయి. దీంతో మద్యం ద్వారా అక్రమార్జన రుచి చూసిన ‘కూటమి నేతలు’ దుకాణాలను యథావిధిగా కొనసాగించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పట్లో టెండర్లు రాకుండా.. మరో ఏడాది పాటు రెన్యువల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత వారికే కట్టబెడితే నెలవారీ మామూళ్లు యథావిధిగా వసూలు చేయవచ్చనే కారణంతో అధికారుల వద్ద కొందరు సిండికేటుగా మారి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఒక్కో దుకాణం నుంచి డిమాండ్ ఆధారంగా రూ.20 లక్షల వరకు చెల్లిస్తే.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రెన్యువల్ చేయిస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత టెండర్లలో దుకాణాలు దక్కించుకుని నష్టాల్లో ఉన్నారని సాకుగా చెబుతూ మళ్లీ వారికే కట్టబెట్టాలని సర్కార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. పైగా ప్రభుత్వంలోని పెద్దలు అభ్యంతరం తెలపకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు కావాల్సినంత సరఫరా చేస్తామంటూ ఎరవేసినట్లు తెలుస్తోంది.
అప్పుడూ సిండికేటే..
చంద్రబాబు అధికారంలోకి రాగానే, అంతకుముందు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలన్నీ రద్దు చేసి.. ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కుమ్మకై ్క తమ అనుచరులు, అనుయాయులకే దుకాణాలు దక్కేలా ప్లాన్ చేశారు. ఇతరులు దరఖాస్తు చేయకుండా బెదిరించారు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి నాలుగు దరఖాస్తులు వేసి.. లాటరీ తీయించి తలాకొన్ని పంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగింది. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో 80 శాతం మంది పైగా కూటమి పార్టీలకు చెందిన వారే ఉన్నారు. దీంతో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన రోజు నుంచి గుడి, బడి తేడా లేకుండా బెల్టు షాపులు ఏర్పాటు చేయించి అమ్మకాలు సాగించారు. రాత్రింబవళ్లు మద్యం ఏరులై పారించారు. దుకాణాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లో ఉండటంతో నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో బెల్టు షాపులతో పాటు మద్యం దుకాణాల్లో అ‘ధన’పు దోపిడీ చేస్తున్నారు. ప్రతి సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. అదే తరహాలో దుకాణాల లీజు కొనసాగింపునకు కూడా ఇప్పుడు సిండికేటుగా మారినట్లు తెలిసింది. రెన్యువల్ కోసం ఒక్కో దుకాణం నుంచి మరో రూ.20 లక్షల వరకు ప్రాంతాల వారీగా.. డిమాండ్ ఆధారంగా షరతు విధించినట్లు తెలిసింది.
సిండికేటుకు లబ్ధి చేకూరేలా..
మద్యం దుకాణాల లీజు గడువు ముగిసిన తర్వాత టెండర్లు ఆహ్వానిస్తే.. ఒక్కో దరఖాస్తుకు గతంలో మాదిరిగా రూ.2 లక్షలు చొప్పున నిర్దేశించినా.. ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది. అయితే లీజు కొనసాగిస్తే.. సిండికేటుకు లబ్ధి చేకూరుతుంది. దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి అందులో ప్రభుత్వ పెద్దలకూ వాటాలిచ్చి లీజు గడువు పెంచేందుకు ఒప్పించే మార్గంలో వెళ్తున్నట్లు తెలిసింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సిన కోట్లాది రూపాయలు కూటమి పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లనున్నాయి.
మద్యం దుకాణాల కోసం మంత్రాంగం
అక్టోబరు 2తో ముగియనున్న
రెండేళ్ల లీజు గడువు
మళ్లీ పాతవారికే కట్టబెట్టేందుకు
సిండికేటు ప్రయత్నాలు
నష్టాల్లో ఉన్నారంటూ పక్కా ప్లాన్‌తో ముందస్తుగా పైరవీలు
మరో ఏడాది లీజు పొడిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిళ్లు
ఒక్కో దుకాణం నుంచి అదనంగా రూ.20 లక్షల వరకు డిమాండ్
‘స్థానిక’ ఎన్నికల వేళ దుకాణాలు తమ్ముళ్ల వద్ద ఉంటేనే మేలంటూ
పెద్దలకు సలహా
మద్యం దుకాణాల ద్వారా రోజూ ప్రభుత్వానికి రూ.కోట్లలో రాబడి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2024 అక్టోబరు నుంచి ఇప్పటి వరకు మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి రూ.1,370 కోట్ల రాబడి వచ్చింది. మరోవైపు బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తూ మద్యం దుకాణాల నిర్వాహకులూ జేబులు నింపుకుంటున్నారు. ఇంకోవైపు బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారంతో ఇటు దుకాణాల నిర్వాహకులు, అటు ప్రభుత్వానికి డబ్బులు వస్తుండగా...మందుబాబుల జేబులకు చిల్లుపడి.. ఇల్లు గుళ్లవుతోంది.


