పుట్టపర్తి అర్బన్: తమ డిమాండ్లపై రెండేళ్లుగా సర్కారు స్పందించకపోయినా మౌనంగా ఉన్న ఉద్యోగులు...తాజాగా సమరభేరి మోగించారు. ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఉద్యోగులు..త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతిగ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ జిల్లా కార్యాలయాల వద్ద ఏపీ జేఏసీ (అమరావతి) నాయకులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ (అమరావతి) జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకూ ఒక్క ఎన్నికల హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, తాత్కాలిక భృతి (ఐఆర్)ని వెంటనే అందజేయాలన్నారు. అలాగే ప్రభుత్వం ముందుంచిన 21 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీవైపీ రావు, మున్సిపాలిటీల నాయకుడు శంకర్, సచివాలయాల జేఏసీ నాయకులు చౌడప్ప, శశికుమార్, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం నాయకులు చక్రపాణి, జిల్లా వైద్య సిబ్బంది వీరమ్మ, కళాధర్, బాబా ఫకృద్దీన్, ఫిరోజ్, నాగభూషణం, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి టౌన్: ‘‘పీఆర్‌సీ, డీఏ, సరెండర్ లీవులు, ఇతర బకాయిల విడుదల చేయడంతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని రెండేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయినా చలనం లేదు. మాకూ ఓపిక లేదు. సెప్టెంబర్ 5వ తేదీలోపు ప్రభుత్వం మా డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయకపోతే ఉద్యమాలకు శ్రీకారం చుడతాం’’ అని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ లింగా రామ్మోహన్ అన్నారు. గురువారం పుట్టపర్తిలోని జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ చంద్ర, ఉద్యోగులు సురేంద్ర, గౌస్‌బాషా, శ్రీరామ్ నాయక్, బాబా ఫకృద్దీన్, వెంకటరాముడు, గఫూర్, దేవేంద్ర, పరిమల, పుష్ప, జనార్దన్‌తోపాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం
స్పష్టం చేసిన ఏపీ జేఏసీ
(అమరావతి) నేతలు
ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధంకావాలని ఏపీజేఏసీ నేత పిలుపు
సెప్టెంబర్ 5 డెడ్‌లైన్.. దాటితే ఉద్యమమే


