పుట్టపర్తి: ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో డీఈఓ కిష్టప్ప అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌టీఏ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక విషయంలో ఎలాంటి ఆలస్యానికి తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
యూటీఎఫ్ నేతల అరెస్టు అప్రజాస్వామికం
ధర్మవరం అర్బన్: విజయవాడ నగరంలో మంగళగిరి వద్ద స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ విద్యాభవన్ ముట్టడికి దిగిన యూటీఎఫ్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు అమర్ నారాయణరెడ్డి, నాగేంద్రమ్మ, రాష్ట్ర కౌన్సిలర్ మేరీవరకుమారి, పట్టణాధ్యక్షుడు జింకా హరికృష్ణ ఖండించారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో మంగళగిరి వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను రద్దుకు అవసరమైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్షను సంబంధిత సబ్జెక్టులో మాత్రమే నిర్వహించి క్వాలిఫైయింగ్ మార్కులు 40 శాతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్ తదితరులను అరెస్టు చేయడం సరికాదన్నారు.
బుక్కపట్నంలో
పట్టపగలే చోరీ
● ఐదు తులాల బంగారు,
రూ.80 వేలు నగదు అపహరణ
పుట్టపర్తి: బుక్కపట్నం మండల కేంద్రంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితుడు శేఖర్ వివరాలమేరకు... స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం వద్ద నివాసం ఉంటున్న జంపాల శేఖర్ ఇంట్లోని బీరువాలో దాచిన రూ.7 లక్షల విలువ చేసే 5 తులాల బంగారు నగలు, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాటు వేసిన దొంగ ఆ ఇంటి బాత్ రూంలో ఉంచిన తాళం చెవిని తీసుకొని నేరుగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతానికి పాల్పడ్డారు. ఆ సమయంలో శేఖర్ భార్య ఉపాధి పనులకు, శేఖర్ వ్యవసాయ పనులకు వెళ్లారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నారాయణరెడ్డి శేఖర్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. రెండు నెలల క్రితం పట్టపగలే ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగిన విషయం ఇంకా మరువకనే మరో దొంగతనం జరగడంలో బుక్కపట్నం వాసులు ఆందోళన చెందుతున్నారు.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన విశాఖ జిల్లా సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం విశాఖటప్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు ‘మానస సంచరే’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ సుమారు గంట పాటు కచేరీ నిర్వహించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


