పుట్టపర్తి టౌన్: ‘పోషణ వనిత’ కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక సాయి ఆరామంలో ‘పోషణ వనిత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వాసన్ అసోిసియేట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ‘పోషణ వనిత’లుగా ఎంపిక చేసి వారి ద్వారా సమాజంలో పోషకాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే పోషకాలున్న పంటలతో పాటు పెరటి తోటల ద్వారా తాజా కూరగాయలు పండించేలా స్థానిక రైతులను ప్రోత్సహిస్తామన్నారు. తొలివిడతలో జిల్లాలోని 10 మండలాల్లో 10 వేల కుటుంబాలను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. వారికి ప్రత్యేక నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబాల పోషకాహార స్థాయిని మెరుగుపరచడం, స్థానిక వైవిద్యాలను ప్రోత్సహించడం, మహిళలకు పోషణ, ఆధారిత జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ‘పోషణ వనిత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోనే ప్రారంభించామని, దశల వారీగా గ్రామాలకూ విస్తరిస్తామన్నారు.
బావిలో పడి వివాహిత మృతి
ఓడీచెరువు: మండల పరిధిలోని నల్లచెరువుపల్లికి చెందిన లక్కసాని ఉషారాణి (37) బావిలో పడి మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల వివరాలమేరకు... నల్లచెరువుపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి, ఉషారాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఉదయం టమాట పంటను చూసేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రతాప్‌రెడ్డి తిరిగి వచ్చేశాడు. ఎంత సేపటికీ భార్య రాకపోవడంతో బోరు బావి దగ్గరికి వెళ్లి వెతకగా ఆమె బావిలోని నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలికి అప్పుడప్పుడూ ఫిట్స్ వచ్చేవని, ప్రమాదవశాత్తూ బావినీటిలో పడి చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి సోమశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


