గోరంట్ల: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొరగా కురిసిన వర్షాలకు మండలంలోని కొందరు రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. అప్పటి నుంచి నేటికీ చినుకు చుక్క నేలరాలకపోవడంతో రైతులు నష్టాల బాట పట్టారు.
కేవలం ఐదు శాతం మందే...
మండలంలో ఖరీఫ్ సీజన్‌లో 14 వేల హెక్టర్లలో రైతులు వేరుశనగ పంట సాగు చేయాల్సి ఉంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో 95 శాతం మంది రైతులు వేరుశనగ పంట సాగు చేయలేదు. కేవలం ఐదు శాతం మంది రైతులు జూన్ మాసంలో పడిన అరకొర వర్షానికి విత్తనం వేశారు. దాదాపు మూడు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో రైతులు విత్తిన విత్తనం మొలకెత్తి ఎదుగు బొదుగు లేకుండా పోయాయి.
రూ.లక్ష నష్టం..
చొండూరివాండ్లపల్లికి చెందిన వడ్డే వెంకటేష్ తనకున్న ఆరు ఎకరాల పొలంలో జూన్ 5న కురిసిన అరకొర వర్షానికి మూడు క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను విత్తారు. అయితే వెంకటేష్ విత్తిన విత్తనం అరకోర వర్షానికి మొలకెత్తింది. అయితే అప్పటి నుంచి మళ్లీ వర్షం జాడ లేకపోవడంతో విత్తన మొలకలు ఏమాత్రం పెరగకుండా అలానే ఉండిపోవడం వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చేయడానికి దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏఓ శంకనాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మండల వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కేవలం 720 హెక్టర్లలో మాత్రమే వేరశనగ పంటను సాగు చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు పడకపోవడంతో వేరుశనగ మొలక పెరగలేదన్నారు.


