ప్రశాంతి నిలయం: కొత్తచెరువు మండల పరిధిలోని బైరాపురం గ్రామ ప్రజలు మంచి నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో స్పందించిన సత్యసాయి భక్తులు గ్రామంలో మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల బైరాపురం గ్రామస్తులు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు కలసి తమ గ్రామంలోని తాగునీటి సమస్యను వివరించారు. స్పందించిన ఆర్‌జె రత్నాకర్‌రాజు పుట్టపర్తి పర్తియాత్రకు వచ్చిన మలేషియా సత్యసాయి భక్తులకు సమస్యను తెలియజేసి మంచినీటి పథకం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారు. దీంతో బైరాపురంలోని 350 కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందించే యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి అవసరమైన విరాళాన్ని మలేషియా సత్యసాయి భక్తులు అందించారు. తాగునీటి పథకం నిర్మాణం పూర్తి కావడంతో గురువారం మలేసియా సత్యసాయి భక్తులు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులతో కలసి ఆ పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి భక్తులు చూపిన సేవాభావంపై బైరాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయి స్ఫూర్తితో తాము ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు మలేషియా సత్యసాయి భక్తులు పేర్కొన్నారు. గ్రామస్తులకు నూతన వస్త్రాలలో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మలేషియా సాయి భక్తులు మహేంద్రన్, శ్రీలంకా విటాన్, డాక్టర్ హూ, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు లక్ష్మణరావు, చంద్రశేఖరన్, సత్యనారాయనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేసిన
మలేషియా సత్యసాయి భక్తులు


