ధర్మవరం అర్బన్: రౌడీషీటర్లు, అనుమానితులు పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం, మహాత్మాగాంధీకాలనీలలో గురువారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రెండు కాలనీలను మొత్తం రౌండప్ చేసి కాలనీల్లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఎవరు లోపలికి రాకుండా పోలీసులు జల్లెడ పట్టారు. డ్రోన్ కెమెరాలతో వార్డు మొత్తం తనిఖీలు చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్ కార్డెన్ సెర్చ్‌ను పరిశీలించారు. రౌడీషీటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి సత్ప్రవర్తనతో మెలగాలని, వారు మారేలా కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ జగన్నాథ్‌రాజుతో పాటు ఐదుగురు సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ, పోలీసులు మొత్తం 102 మంది ఇంటింటా తనిఖీలు చేపట్టామన్నారు. రానున్న గణేష్ ఉత్సవాలు, స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల కాపాడటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రికార్డులు, నంబర్ ప్లేట్లు లేని 75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, కారు, అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేశామని తెలిపారు. రికార్డులు చూపి వాహనాలను తీసుకెళ్లాలని, సరైన రికార్డులు చూపని వాహనాలపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్‌రాజు, సీఐలు రెడ్డెప్ప, జయనాయక్, సునీత పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
75 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, కారు, అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల సీజ్


