సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచండి

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశం

కనగానపల్లి: స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కనగానపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది రోల్‌ కాల్‌ (డ్యూటీ షెడ్యూల్‌)ను పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికలు, వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో రాజకీయ, వర్గకక్షలు ప్రేరేపితం కాకుండా ముఠా నాయకులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అలాగే గ్రామాల్లో దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు జరకుండా రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మహమ్మద్‌ రిజ్వాన్‌, ఏఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

క్షుద్రపూజల కలకలం

నల్లచెరువు: మండలంలో బుధవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. నల్లచెరువుకు చెందిన కుళ్లాయప్ప అనే వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని బుధవారం ముస్లింలు ఖబరస్తాన్‌కు తీసుకువెళ్లారు. అయితే ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కర్పూరం, పూలు, కోడిగుడ్లు ఉంచి పూజలు నిర్వహించినట్లు గుర్తించిన ముస్లింలు భయాందోళన చెందారు. ఆ విషయం ఆ నోటా..ఈ నోటా మండలమంతా వ్యాపించగా...స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

డిమాండ్లు నెరవేర్చే వరకూ పోరుబాటే

ధర్మవరం అర్బన్‌: పారా మెడికల్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ పోరుబాట వీడబోమని కాంట్రాక్ట్‌ మెడికల్‌, పారా మెడికల్‌ ఉద్యోగులు తేల్చిచెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు చేపట్టిన నిరసన బుధవారంతో 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... వైద్యశాఖలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, అంతవరూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరికీ వంద శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో అర్హులైన వారికి కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ అమలు చేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన వైద్య సెలవులు మంజూరు చేసి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు హెల్త్‌కార్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరంతరం పోరాడతామన్నారు. నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ మెడికల్‌, పారా మెడికల్‌ ఉద్యోగులు పుష్పలత, కమలమ్మ, జయమ్మ, మహబూబ్‌జాను, మాధవి, విదియ, సంధ్య, మహాదేవి, లలిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement