మాటలతో రెచ్చగొట్టి.. చితకబాది! | - | Sakshi
Sakshi News home page

మాటలతో రెచ్చగొట్టి.. చితకబాది!

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బంది దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. వారి సూచనలు పాటించకపోతే బూతులతో రెచ్చిపోతారు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బుధవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసిన పల్లికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై సర్వజనాస్పత్రికి వచ్చాడు. అప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన తన తండ్రికి అవసరమైన మందుల కోసం వచ్చిన అతను తన వాహనాన్ని పార్క్‌ చేస్తున్న సమయంలో అక్కడున్న సిబ్బంది పక్కకు తీసుకెళ్లి పెట్టాలని తెలిపారు. దీంతో అతను మందులు తీసుకుని వెంటనే వెళ్లిపోతానని అనడంతో సిబ్బంది ససేమిరా అన్నారు. మాటలతో రెచ్చగొట్టి యువకుడిని పక్కకు నెట్టారు. ఆ సమయంలో స్వీయ రక్షణలో భాగంగా యువకుడు ప్రతిఘటించడంతో సిబ్బంది చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. పెదవి పగిలింది. అక్కడున్న వారు సర్దిచెప్పి యువకుడిని వెంటనే ఏఎంసీలో చికిత్స కోసం తరలించారు.

సర్వజనాస్పత్రిలో

పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బంది దౌర్జన్యం

తీవ్ర రక్తగాయాలతో

ఆస్పత్రిలో చేరిన ధర్మవరం వాసి

బాధితుడిపైనే ఫిర్యాదు

దాడికి సంబంధించి బాధితుడిని సర్వజనాస్పత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు విచారించారు. అతడి ఫిర్యాదు మేరకు దౌర్జన్యం చేసిన పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బందిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్‌ వెంటనే అప్రమత్తమై సదరు యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసేలా పావులు కదిపాడు. వాహనాన్ని పక్కన పెట్టమని చెప్పినందుకు తమపైనే యువకుడు దాడి చేసి గాయపరిచాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాలపై కేసుల నమోదుకు రెండో పట్టణ పోలీసులకు అవుట్‌పోస్టు సిబ్బంది సిఫారసు చేశారు. ఈ విషయమై సర్వజనాస్పత్రి పరిపాలనా అధికారి మల్లికార్జునరెడ్డిని వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తే పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ టెండర్‌ను రద్దు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement