అనంతపురం సిటీ: అంగన్‌వాడీ సిబ్బందిని యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమలుచేస్తున్న ‘బాల సంజీవని’ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి 2.0 పేరుతో అందుబాటులోకి తెచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేసేందుకు వీలుగా మార్పులు చేసిన తరువాత ఈ యాప్ సరిగా పనిచేయడం లేదని, దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు.
గంటల తరబడి కుస్తీ..
ప్రస్తుతం అంగన్‌వాడీలపై ఎనిమిది రకాల యాప్‌ల భారాన్ని ప్రభుత్వం మోపింది. కేవలం పదో తరగతి చదువుతో ఈ చిరుద్యోగానికి వచ్చిన చాలా మందిలో స్మార్ట్ ఫోన్ల వినియోగంపై సరైన అవగాహన లేదు. ఇలాంటి వారికి ఎనిమిది రకాల యాప్‌ల ద్వారా సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం తలకు మించిన భారమే అవుతోంది. అంతేకాక సాంకేతిక కారణాలతో చాలా చోట్ల యాప్‌లు సక్రమంగా ఓపెన్ కాక గంటల తరబడి కుస్తీ పట్టాల్సి వస్తోంది. రోజూ యాప్‌లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు నమోదు చేయడంతో పాటు వారి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసిన తరువాతే రేషన్ అందించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాలతో ఒక్కోసారి లబ్ధిదారులు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో వారికి సరుకులు అందించడం కష్టమవుతోంది. సిబ్బంది హాజరు కూడా ఇదే యాప్‌లో నమోదు చేయాల్సి ఉందని, సమయానికి యాప్ ఓపెన్ కాకపోవడంతో కేంద్రానికి ఆలస్యంగా వచ్చినట్టు నమోదవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చుల వివరాలూ..
గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖర్చులకు సంబంధించిన వివరాలను మాన్యువల్‌గా రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. తాజాగా పిల్లలకు వండి వడ్డించేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రతి రూపాయిని యాప్‌లోనే అప్‌లోడ్ చేయాలి. సాంకేతిక సమస్యలతో వివరాలు అప్‌లోడ్ కాకపోతే మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లలు గుండు చేయించుకుని ఉన్నా, ఫొటో తీసే సమయంలో కెమెరా వైపు చూడకపోయినా వారి హాజరును లెక్కించడం లేదని, దీంతో రోజువారీ ఖర్చులపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరం..
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు ఉన్న చిన్నారులకు అందిస్తున్న టేక్ హోం రేషన్, బాలామృతం పంపిణీకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (పోషన్ అభియాన్)ను వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ వినియోగంలో నెట్‌వర్క్ కష్టాలు వెన్నాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగా ఉండకపోవడంతో లబ్ధిదారుల ఫేస్‌ను క్యాప్చర్ చేయడానికి చాలా సమయం పడుతోంది.
అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వీర్యం!
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు యాప్‌ల కారణంగా నిర్వీర్యమైపోయాయి. పూర్వ ప్రాథమిక విద్య బలపడేలా అందజేసిన కిట్‌లు కూడా నిరుపయోగంగా మారాయి. ఆటపాటలతో చిన్నారులకు బోధన చేయాల్సిన సమయం కాస్త యాప్‌లలో సమాచారాన్ని నింపి అప్‌లోడ్ చేయడానికే సరిపోతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు కనీస రెయిమ్స్ కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. కొన్ని సెంటర్లలో పిల్లలు ఎత్తుకు తగిన బరువు కూడా ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి యాప్‌ల భారం తగ్గించాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.
‘‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకంటే దారుణంగా ఉంది మా పరిస్థితి. కేవలం పదో తరగతి వరకు చదువుకున్న వారిపై ఇంతటి సాంకేతిక పని భారాన్ని మోపడం సరికాదు. ఈ విషయంగా ప్రశ్నిస్తే ఆ నాలెడ్జ్ ఉన్న వారితో పని పూర్తి చేయించాలని చెబుతున్నారు. అయితే పని చేసిన వారికి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వరంట. అది కూడా మేమే ఇచ్చుకోవాలంటా’’
– ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఆవేదన ఇది..
అటకెక్కిన పూర్వ ప్రాథమిక విద్య
చదువు చెప్పడం కంటే
యాప్‌లతోనే కుస్తీ
సాంకేతిక సమస్యతో
వినియోగంలో ఇబ్బందులు
మనుషులుగా చూడడం లేదు
అంగన్‌వాడీ కార్యకర్తలను మనుషులుగా కాకుండా యంత్రాలుగా ప్రభుత్వం చూస్తోంది. అన్ని రకాల పనులను వారితో చేయిస్తోంది. దీంతో ఐసీడీఎస్ ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం కాస్త నీరుగారిపోతోంది. రోజంతా సెల్‌ఫోన్లలోనే పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
– ఎస్.నాగేంద్రకుమార్, సీఐటీయూ
అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి


