● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
కనగానపల్లి(చెన్నేకొత్తపల్లి): భూముల రీ సర్వే ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేజ్ మ్యాప్‌లు పరిశీలించి సర్వే నంబర్ల హద్దులను తనిఖీ చేశారు. భూ యజమానులు, రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా చేయాలని రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన చెన్నేకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌బాబు, మండల సర్వేయర్ సంతోషలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
హిందూపురం టౌన్: పుదుచ్చేరిలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్న 7వ సౌత్‌జోన్ పెంకాక్ సిలాట్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు హిందూపురానికి చెందిన ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. పట్టణంలోని ఎంజీఎం మైదానంలో గల సీ–మ్యాన్ అకాడమీ నుంచి యతికా రుక్మిణి, ఆర్.రియా, ఓంకార్ దేవ్, జీఎం రాజు, ఎఫ్. సమీర్, అలాగే ఇతర పాఠశాల, కళాశాల నుంచి జి.రుచిత, కురుబ మణితేజ, డి.సానియా ఎంపికై న వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా పెంకాక్ సిలాట్ కోచ్ ప్రవీణ్ కుమార్, పెంకాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రియాజ్ బాషా, ఉపాధ్యక్షుడు ఖాన్ బాబా ఫక్రుద్దీన్, కార్యదర్శి జనార్దన్ రెడ్డి, హరికృష్ణ, సాధిక్ తదితరులు క్రీడాకారులను అభినందించారు. సౌత్‌జోన్ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
ఇసుక అక్రమ తరలింపు.. టిప్పర్, ట్రాక్టర్ల పట్టివేత
ధర్మవరం రూరల్: చిత్రావతి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక టిప్పర్, 7 ట్రాక్టర్లను బుధవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దేవరాజ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక, మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల వ్యాప్తంగా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బైండోవర్ షరతుల
ఉల్లంఘన.. వ్యక్తికి రిమాండ్
రొళ్ల: బైండోవర్ షరతులు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ నరసింహుడు హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని కల్లురొప్పంగొల్లహట్టి గ్రామానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి ఇది వరకే విధించిన బైండోవర్ ఉల్లంఘించినట్లు గుర్తించి అతనిపై చర్యలు చేపట్టినట్లు వివరించారు. దేవరాజును స్థానిక తహసీల్దార్ చంద్రశేఖర్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. మడకశిరలో న్యాయమూర్తి ఎదుట దేవరాజు హాజరు పరచగా 15 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు. బైండోవర్ చేసిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి గొడవలు, ఇతర నేరాలకు పాల్పడకూడదన్నారు. అలాచేస్తే బైండోవర్ ఉల్లంఘన కింద రూ.5,00,000 జరిమాన లేదా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్‌ఐ కోరారు.


